- తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించిన సౌదీ
కైరో: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై మంగళవారం భీకర దాడులకు పాల్పడ్డారు. మిసైళ్లు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో 73 మంది గాయపడ్డారు. సౌదీ దక్షిణ ప్రాంతంలోని చమురు కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. అబ్హా, జిజాన్, నజ్రాన్, ఖమీస్ ముషైత్ నగరాల్లోని పలు ప్రాంతాలపై దాడులు జరిగినట్లు సౌదీ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
జిజాన్‌లోని అయిల్ రిఫైనరీతో పాటు మరికొన్ని చమురు, ఇంధన కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి కొద్దిసేపు పనులను నిలిపివేశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సౌదీ చమురు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గమైన బాబ్ ఎల్-మందెబ్ సముద్ర మార్గానికి సమీపంలోనే ఈ ప్రాంతాలు ఉండడం గమనార్హం.
దాడులు చేసింది తామేనన్న హౌతీలు
తమ దళాలు డజన్ల కొద్దీ మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. జిజాన్‌లోని పారిశ్రామిక ప్రాంతం, నజ్రాన్, అబ్హాలోని సౌదీ అరామ్‌కో కేంద్రాలు, ఖమీస్ ముషైత్‌లోని కింగ్ ఖాలిద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. యెమెన్‌పై సౌదీ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు దిగినట్లు తెలిపారు. ఈ దాడులను తీవ్ర పరిణామంగా పేర్కొన్న సౌదీ.. బాధ్యులపై తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించింది.
