- పోలీసులపై జరిగిన దాడి ఫొటోలను అసెంబ్లీలో ప్రదర్శన
- స్పీకర్‌ను తల్లి పేరుతో దూషించడంపై ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులను మెడపట్టి, గొంతునులిమి చంపడానికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని దూషించడంపై మంగళవారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన సమయంలో కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.
స్పీకర్ అనుమతితో పోలీసులపై జరిగిన దాడి ఫొటోలను ఆయన అసెంబ్లీలో ప్రదర్శించారు. పోలీసుల దాడిలో తమకు దెబ్బలు తగిలాయంటూ సోమవారం చేతులకు, కాళ్లకు కట్లు కట్టుకొని మీడియాలో కనిపించిన నేతలు.. ఒక రోజు తిరిగేసరికి డ్యాన్స్‌లు చేస్తూ కనిపిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను దూషించడం కేసీఆర్ ప్రేరేపిత చర్య అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీది మొదటి నుంచి భూర్జువా మనస్తత్వం ఉన్న పార్టీయేనని చెప్పారు.
బీఆర్‌ఎస్ తీరు జుగుస్సాకరం: పద్మావతి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్ట్‌లపై స్లోగన్స్ రాసుకొని ఫ్లకార్డుల మాదిరిగా అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీసులు అడ్డుకున్నారని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్ల ఛాతీపై బీఆర్‌ఎస్ లీడర్లు మోచేతులతో గుద్దారని, వారిని అసభ్యకరమైన రీతిలో తాకారని మండిపడ్డారు. మహిళా పోలీసుల ముందే చొక్కాలు విప్పి జుగుప్సాకరమైన రీతిలో వ్యవహరించడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలంతా కలిసి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మైక్‌కు దొరకకుండా అసెంబ్లీలో సైడ్ కామెంట్స్ చేస్తూ తప్పుగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిని భరించలేకపోతున్నామని ఇక వారికి శిక్ష పడాల్సిందేనన్నారు.
తాతా మధును బర్తరఫ్ చేయాలి: అనిరుధ్ రెడ్డి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అగౌరవపరిచిన ఎమ్మెల్సీ తాతా మధును శాశ్వతంగా ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీటీసీ నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన వ్యక్తిని తన తల్లి పేరుతో దూషించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే విజయరమణారావు
స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించిన ఎమ్మెల్సీ తాతా మధు, అసెంబ్లీ ముందు డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసిన కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్ చేశారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే ఇది జరిగిందన్నారు. అసెంబ్లీ సెషన్ స్టార్ట్కావడానికి ఒక రోజు ముందే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్ జరిగిందని, అందులోనే స్పీకర్‌ను అవమానించే కుట్రకు తెరతీసిందన్నారు. కేసీఆర్‌కు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపేనని మండిపడ్డారు.
