కేటీఆర్ నోట మళ్లీ చిల్లర మాటలు.. సీఎం రేవంత్ పై మరోసారి తిట్లు, శాపనార్థాలు

కేటీఆర్ నోట మళ్లీ చిల్లర మాటలు.. సీఎం రేవంత్ పై మరోసారి తిట్లు, శాపనార్థాలు
  • ఎర్రవల్లి ఫాంహౌస్​కు వెళ్తుండగా హకీంపేట వద్ద అడ్డుకున్న పోలీసులు
  • కాంగ్రెస్​ గూండాలకు పోలీసు ఎస్కార్ట్​ ఇచ్చి పంపిస్తున్నరన్న కేటీఆర్​​
  • కేసీఆర్​కు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమైతదని వార్నింగ్​
  • కార్లు దిగి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్యేలు
  • బోయిన్​పల్లి పీఎస్​కు కేటీఆర్.. జవహర్​నగర్ ​పీఎస్​కు హరీశ్​ తరలింపు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్​రెడ్డిపై మరోసారి నోరు పారేసుకున్నారు. సోమవారం అసెంబ్లీ వద్ద పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆయన.. మంగళవారం కూడా అలాగే వ్యవహరించారు. సీఎం రేవంత్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

మంగళవారం ఉదయం కాంగ్రెస్​ శ్రేణులు ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫాంహౌస్​ వద్ద చావుడప్పు కొట్టేందుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి ఫాంహౌస్​కు కేటీఆర్, హరీశ్​ రావు సహా బీఆర్ఎస్​ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి బయల్దేరి వెళ్లారు.

బీఆర్ఎస్​ నేతల వాహనాలు హకీంపేటకు చేరుకోగానే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్​వాగ్వాదానికి దిగారు. ‘మా ఇంటికి మేం పోతుంటే ఎందుకు ఆపుతున్నరు. కాంగ్రెస్​ గూండాలను ఎందుకు ఆపడం లేదు? వాళ్లకు పోలీసులు ఎస్కార్ట్​ ఇచ్చి తీస్కపోతున్నరు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. కాంగ్రెస్​ గూండాలను, నగర బహిష్కరణ చేసిన రౌడీలను పోలీసులు దగ్గరుండి కేసీఆర్​ ఫాంహౌస్​ మీదికి పంపుతున్నారని మండిపడ్డారు. తాను తన ఇంటికి వెళ్తుంటే అడ్డుకోవడానికి పోలీసులెవరని ఫైర్​అయ్యారు.

పోలీసులే దగ్గరుండి కేసీఆర్​పై దాడికి దారి చూపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్​కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందంటూ హెచ్చరించారు. లక్షల మంది రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు ప్రభుత్వానికి వంతపాడడం ఆపాలని వార్నింగ్​ ఇచ్చారు. తమను ఆపినట్టు కాంగ్రెస్​ వాళ్లను ఎందుకు ఆపడం లేదని నిలదీశారు. తమ నాయకుడిని తామే కాపాడుకుంటామని, పోలీసుల మీద నమ్మకం లేదన్నారు.

కార్లు దిగి.. నడుచుకుంటూ వెళ్లి..
శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఎంత చెప్పినా బీఆర్​ఎస్​ నేతలు వినలేదు. భారీ కాన్వాయ్​లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. కేటీఆర్​, హరీశ్​ రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, వేముల ప్రశాంత్​రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలంతా కార్లు దిగి నడుచుకుంటూ ఫాంహౌస్​కు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల వాళ్లను అనుమతించకపోవడంతో.. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్​ చేసి వేర్వేరు పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

హరీశ్ రావును జవహర్​నగర్​ పోలీస్​స్టేషన్​కు, కేటీఆర్​ను బోయినపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. దీంతో ఆ రెండు పోలీస్​ స్టేషన్ల వద్దకు భారీగా బీఆర్​ఎస్​ శ్రేణులు తరలివచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్​స్టేషన్ల ముందు బైఠాయించి నిరసనలు చేపట్టారు. వారికిపోటీగా కాంగ్రెస్​ శ్రేణులు కూడా రెండు పోలీస్​ స్టేషన్ల వద్దకు భారీగా చేరుకున్నారు. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు పోలీస్​స్టేషన్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.