న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.12,500 కోట్లు సమీకరించడానికి బాండ్లు జారీ చేయనుంది. ఈ ఏడాది మార్కెట్లో ఇదే అతిపెద్ద లిస్టెడ్ డీల్ కానుంది. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఈ బాండ్లపై 7.47శాతం కూపన్ రేటును నిర్ణయించారు. సోమవారం ముగిసిన కార్పొరేట్ బాండ్ల సగటు రాబడి కంటే ఈ రేటు తక్కువగా ఉంది. రిలయన్స్ 2023 నవంబర్ తర్వాత తొలిసారిగా ఈ బాండ్లను జారీ చేస్తోంది.
తక్కువ వడ్డీ రేట్ల కారణంగా కంపెనీలు బాండ్లకు బదులు బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నాయి. ఈ బాండ్లు స్థానిక రుణ మార్కెట్‌కు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ముప్పు పెరుగుతున్నందున ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందనే అంచనాల మధ్య ఇతర కంపెనీలు కూడా బాండ్ల జారీని పరిశీలిస్తున్నాయి. టాప్ రేటింగ్ఉన్న కంపెనీ ఈ బాండ్లకు గిరాకీ బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
