సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కలిపు మధు, లక్ష్మణ్ కలిసి నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ చెప్పిన విశేషాలు.
‘‘నా కెరీర్‌లో వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్‌లో తెరకెక్కించారు. హిందీ, తమిళ భాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. నార్త్‌లో కూడా సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన రావడం చాలా సంతోషాన్నిచ్చింది. సినిమా మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇందులోని ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి.
అవి ప్రేక్షకులకు మంచి హై ఇస్తాయి. డైరెక్టర్ సంతోష్‌కు వేదాలు, పురాణాలపై మంచి అవగాహన ఉంది. తను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది కేవలం డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
నా పాత్ర విషయానికి వస్తే.. యూట్యూబ్‌లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తా. నా క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సిద్దు జొన్నలగడ్డ చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య వచ్చే ఒక సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంది.
ట్రైలర్‌లో 33 ఏళ్లు దాటితే ఒక వంశంలో వ్యక్తులు చనిపోతున్నారనే పాయింట్ ‘మురారి’ సినిమాను గుర్తు చేసినా, ఇందులోని కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. హీరో పాత్రలతో పాటు మంచి విలన్ క్యారెక్టర్లు, బలమైన సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా’’.
