చెన్నై: ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ కష్టాల్లో పడింది. కెప్టెన్ తిలక్ వర్మ (133 బాల్స్‌లో 5 ఫోర్లతో 56 బ్యాటింగ్) పోరాడుతున్నా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (2/17) తక్కువ వ్యవధిలో కీలక స్పెల్స్ వేసి రెండు వికెట్లు తీయడంతో ఈస్ట్ జోన్ టైటిల్‌కు చేరువైంది. ముకేశ్ కుమార్ (2/36) కూడా బౌలింగ్‌లో విజృంభించడంతో.. మంగళవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 242/6 స్కోరు చేసింది. తిలక్‌తో పాటు చామ మిలింద్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. దేవదత్ పడిక్కల్ (104 బాల్స్‌లో 4 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం సౌత్ ఇంకా 466 రన్స్ వెనకబడి ఉంది.
షమీ సూపర్..
మూడో రోజు ఉదయం ఆట మొదలుపెట్టిన సౌత్‌కు ఆరో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ముకేశ్ బౌలింగ్‌లో ఓపెనర్ రికీ భుయ్ (1) ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన పడిక్కల్, రెండో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (32) నిలకడగా ఆడారు. ఈస్ట్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. అయితే స్పిన్నర్ల బౌలింగ్‌లో చూడముచ్చటైన బౌండ్రీలు రాబట్టిన జగదీశన్ డ్రైవ్స్ కొట్టాలనే తాపత్రయంతో వికెట్ పారేసుకున్నాడు.
పార్ట్ టైమ్ స్పిన్నర్ శిఖర్ మోహన్ (1/52) ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేసిన బాల్‌ను జగదీశన్ భారీ షాట్‌కు ట్రై చేశాడు.
కానీ బాల్ కవర్స్‌లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ చేతుల్లోకి వెళ్లింది. ఫలితంగా రెండో వికెట్‌కు 60 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. షేక్ రషీద్ (27)తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే షమీ రాకతో సౌత్ ఇన్నింగ్స్‌లో కంగారు మొదలైంది. స్టంప్టు స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేస్తూ సౌత్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు.
లెంగ్త్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. పడిక్కల్‌తో మూడో వికెట్‌కు 56 రన్స్ జోడించిన రషీద్‌ను 34వ ఓవర్‌లో షమీ ఎల్బీ చేశాడు. ఇన్ స్వింగర్‌ను డిఫెన్స్ చేయబోయిన రషీద్ వికెట్ల ముందు దొరికాడు. రవిచంద్రన్ స్మారన్ (23)తో కలిసి నిలకడగా ఆడిన పడిక్కల్ 65 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ముకేశ్ ఈ జోడీని ఎక్కువసేపు నిలవనీయలేదు. 36వ ఓవర్‌లో ముకేశ్ స్ట్రయిట్‌గా ఫ్యాడ్ల మీదకు వేసిన బాల్‌ను పడిక్కల్ ప్లిక్ చేయబోయి డీప్‌లో డీపీ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
దాంతో మూడు రన్స్ తేడాలో రెండు కీలక వికెట్లు పడటంతో సౌత్ జోన్ స్కోరు 129/4గా మారింది. ఈ దశలో వచ్చిన తిలక్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. రెండో ఎండ్‌లో స్మారన్‌తో కలిసి మెల్లగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఫలితంగా ఐదో వికెట్‌కు 45 రన్స్ జోడించి ఈ ఇద్దరు కుదురుకున్నారు. కానీ 20 ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన షమీ సౌత్‌కు ఝలక్ ఇచ్చాడు. స్టంప్స్ మీదుగా ఫుల్లర్ డెలివరీతో బౌలింగ్ మొదలుపెట్టిన అతను.. స్మారన్‌కు దగ్గరగా రెండు బాల్స్ వేశాడు.
కానీ నాలుగో బాల్ వికెట్లకు దూరంగా వేయడంతో స్మారన్ అనవసరంగా టచ్ చేశాడు. స్టాండిన్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ డీఆర్‌ఎస్ తీసుకోవడంతో టీవీ అంపైర్ ఔటిచ్చాడు. స్కోరు 174/5గా మారింది. చివర్లో శ్రేయస్ గోపాల్ (26), తిలక్ రెండు గంటల పాటు పోరాడారు. 26.4 ఓవర్లు నిలకడగా ఆడి 66 రన్స్ జోడించి గోపాల్ వెనుదిరిగాడు. ఫాలో ఆన్ ముప్పును తప్పించుకోవడానికి సౌత్ భారీ స్కోరు చేయాల్సి ఉండటంతో ఓటమి తప్పేలా లేదు.
