రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి..ద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉంది

రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి..ద్యారంగం తీవ్ర సంక్షోభంలో  ఉంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. రూ.15 వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఫీజు బకాయిల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి రాంచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిల కారణంగా అంధకారంలోకి పడిపోయిందని రాంచందర్ రావు తన లేఖలో పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో.. విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేవలం విద్యార్థులే కాకుండా కాలేజీల మేనేజ్మెంట్లు, లెక్చరర్లు, సిబ్బంది కూడా జీతాలు లేక, సగం జీతాలతో నెట్టుకొస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ శ్రేణులు, విద్యార్థులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, లాఠీచార్జీలతో అణచివేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. విద్యార్థుల గొంతుకై నిలబడిన తనను పది రోజుల్లో నాలుగు సార్లు అరెస్ట్ చేశారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఏంటని ప్రశ్నించారు. 

హామీలు గాలికి.. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా.. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, విద్యా భరోసా కార్డ్స్ వంటివి పూర్తిగా విస్మరించారని రాంచందర్ రావు ఆరోపించారు. పాలిటెక్నిక్ కాలేజీల విలీనం పేరుతో రియల్ ఎస్టేట్ దందాలకు తెరలేపుతున్నారని, ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్ పదేళ్లుగా పెంచలేదని, హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 

సమస్యలపై ప్రశ్నిస్తే మరో రెండేళ్లు సమయం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. దీనిపై రాహుల్ గాంధీ వెంటనే స్పందించి, సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయించాలని, విద్యావ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కపట నాటకాలు

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలను, తిట్లను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాంచందర్ రావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ అరాచకాల నుంచి విముక్తి కోరి ప్రజలు కాంగ్రెస్‌‌కు అధికారం ఇస్తే.. ఆ రెండు పార్టీలూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత దూషణలు, కెమెరా పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. 

వేలాది కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు, వివాదాస్పద 22ఏ నిషేధిత భూముల జాబితా సమస్య, పీఆర్సీ, పెండింగ్ డీఏలపై చట్టసభల్లో చర్చించాల్సిన అత్యవసర పరిస్థితి ఉన్నా.. ఇరు పార్టీలు తమ పాపాలు, అసమర్థత బయటపడకుండా అసెంబ్లీని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్, 22ఏ భూముల సమస్యలపై బీజేపీ పక్షాన ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై అడ్డుకున్నాయని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని రాంచందర్ రావు పేర్కొన్నారు.