గుర్తింపు సంఘంగా నాలుగేండ్లు కొనసాగుతాం..24 ఒప్పందాలను జీర్ణించుకోలేకే అసత్య ప్రచారం

గుర్తింపు సంఘంగా నాలుగేండ్లు కొనసాగుతాం..24 ఒప్పందాలను జీర్ణించుకోలేకే అసత్య ప్రచారం
  • ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణ గుర్తింపు సంఘంగా నాలుగేండ్లు తమదే అధికారమని ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట-1 బొగ్గు గనిపై బుధవారం నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 'ఏఐటీయూసీ గెలిస్తే రెండేళ్లా.. మీరు గెలిస్తే నాలుగు నుంచి ఆరేండ్లు అధికారంలో ఉంటారా..? ఇది ఎక్కడి న్యాయం' అని ప్రశ్నించారు. 

ఏఐటీయూసీ సైతం నాలుగేండ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగుతుందని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గత గుర్తింపు సంఘం 12 ఏండ్లు అధికారంలో ఉండి కార్మికులకు ఏం ప్రయోజనం చేకూర్చిందని ప్రశ్నించారు. తాము సాధించిన 24 ఒప్పందాలను చూసి జీర్ణించుకోలేకే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 కార్మికుల ఐక్యత, ఏఐటీయూసీ పోరాటం, సమ్మె నోటీసు, ఆర్ఎల్ సీ చర్చల ద్వారా హక్కులు సాధించుకున్నామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేశ్, పిట్ సెక్రటరీ వి.రాజేందర్, సీనియర్​లీడర్ చిప్ప నర్సయ్య, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, ఎస్.నాగేశ్వరరావు, మీనుగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ పార్వతి సురేశ్ పాల్గొన్నారు.