ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పులి..15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో సంచారం

ఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పులి..15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో సంచారం
  • పశువులపై దాడి చేస్తుండడంతో భయాందోళనలో ప్రజలు
  • తిప్పేశ్వర్ నుంచి పెన్ గంగా దాటి వచ్చిన పులి
  • పులి కదలికలపై ఫారెస్ట్ ఆఫీసర్ల నిఘా

ఆదిలాబాద్, వెలుగు :ఆదిలాబాద్ జిల్లా వాసులను పులి హడలెత్తిస్తోంది. గత 15 రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల శివారుల్లోని పంట చేనుల్లో తిరుగుతుండడం, పశువులపై దాడి చేస్తుండడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్, తడాబా అభయారణ్యంలో ఉన్న పులులు ప్రతి ఏడాది ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంటాయి. సాధారణంగా మేటింగ్ సమయమైన నవంబర్, డిసెంబర్ లో పులుల రాక ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మేటింగ్ సమయాని కి ముందే జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని భీంపూర్, తాంసీ, సొనాల, భోరజ్ మండలాల్లో పులులు సంచారం కనిపిస్తోంది. 

ఒక్కటా.. రెండా ? 

ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో తిరుగుతున్నది ఒక్కటే పులా.. లేక రెండు తిరుగుతున్నాయా అనేది అంతుచిక్కడం లేదు. అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలు మాత్రం రెండు పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. బోథ్, సొనాల మండలాల్లోని మర్లపల్లి, వజ్జర్ అటవీ ప్రాంతాల్లో రెండు పులులను చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

మరో నెల రోజుల్లో తిప్పేశ్వర్ నుంచి పులుల రాక పెరిగే అవకాశం ఉంది. తిప్పేశ్వర్ లో సుమారు 25 పులులు ఉండగా, ప్రతి ఏడాది నాలుగు నుంచి ఐదు పులులు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుతం ఉన్న పెద్ద పులి నెల రోజుల క్రితం నుంచి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వరుసగా పులి దాడి ఘటనలు జరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. బేస్ క్యాంప్ లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులులు తిరిగే ప్రాంతాల్లోకి ప్రజలు ఒంటరిగా వెళ్లొద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. 

ఇటీవలి ఘటనలు

  • ఆగస్ట్ 10న భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి శివారులోని పంట పొలంలో పులి తిరుగుతూ స్థానికుల కంట పడింది. 
  • ఆగస్ట్ 18న అర్లి(టి) శివారు పంటచేనులో అడవిపందిపై దాడి చేయగా, రెండు రోజుల తర్వాత బోథ్ మండలంలోని కంటేగాం శివారులో ఆవుపై దాడి చేసి చంపేసింది. 
  • 26న బోథ్ చింతల్ బోరి అటవీ ప్రాంతంలో మందపై దాడి చేసి లేగదూడను ఎత్తుకెళ్లింది.
  • మరుసటి రోజు అంతర్గాం శివారులోని పంటచేలో, సెప్టెంబర్ 2న తలమడుగు మండలం సకినాపూర్ శివారు పంటచేలో రైతులకు కనిపించింది.