- వరుసగా మూడో సెషన్‌లోనూ పడిన సెన్సెక్స్, నిఫ్టీ
- రూ.4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు 34 పైసలు తగ్గిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్ల పతనం బుధవారం కూడా కొనసాగింది. ఇరాన్–అమెరికా యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్లతోపాటు మన మార్కెట్లూ పడుతున్నాయి. బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లు దాటడం కలవరపెడుతోంది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో బుధవారం అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 813 పాయింట్లు (1.08 శాతం) పడి మూడు నెలల కనిష్టమైన 74,764 లెవెల్‌కు పడిపోగా, నిఫ్టీ 203.60 పాయింట్లు పతనమై 23,431.50 వద్ద సెటిలైంది. ఈ ఏడాది జూన్ 11 తర్వాత నిఫ్టీకి ఇదే కనిష్ట స్థాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
హెచ్‌సీఎల్ టెక్ 4.55 శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్ 4.43 శాతం, టెక్ మహీంద్రా 3.87 శాతం, టీసీఎస్ 2.26 శాతం పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ అదానీ పోర్ట్స్ 3.67 శాతం లాభపడగా, టాటా స్టీల్, ట్రెంట్, ఎన్‌టీపీసీ షేర్లు రాణించాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 3.21 శాతం, రియల్టీ 2.01 శాతం, ఇన్సూరెన్స్ 1.49 శాతం మేర క్షీణించాయి.
మెటల్, ఎనర్జీ, పవర్, కమోడిటీస్ రంగాలు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో కొరియా, షాంఘై లాభపడగా, నిక్కీ, హాంగ్‌సెంగ్ నష్టపోయాయి. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల కారణంగా మార్కెట్ పడుతోందని నిపుణులు తెలిపారు. క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం 34 పైసలు క్షీణించి 95.08 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పైపైకి
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం, క్రూడాయిల్ సప్లయ్‌లో పెరుగుతున్న అంతరాయం కారణంగా చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.05 శాతం ఎగబాకి బ్యారెల్‌కు 100.19 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఈ ఏడాది జులై 24 తర్వాత బ్రెంట్ ధర 100 డాలర్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. మరోవైపు యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా 1.60 శాతం పెరిగి బ్యారెల్‌కు 94.52 డాలర్లకు చేరింది.
ఈ ఏడాది ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు బ్రెంట్ ధరలు దాదాపు 25 శాతం పెరిగాయి. సౌదీ అరేబియా ఆయిల్ ప్లాంట్లపై హౌతీల దాడులు, ఎర్రసముద్రం మీదుగా నౌకా రవాణాలో అంతరాయం వంటివి అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా రోజువారీ చమురు రవాణా గతంలో ఉన్న 80–-90 లక్షల బ్యారెళ్ల నుంచి ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల కంటే తక్కువకు పడిపోవడం చూస్తే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా మారాయో అర్థమవుతోంది.
ఒమన్ తీరంలోనూ షిప్- టు- షిప్ బదిలీలు ఆగిపోతే సరఫరా మరింత పడిపోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యూఎస్, కెనడా, గయానా దేశాలలో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఈ లోటును పూడ్చడం సాధ్యం కావడం లేదు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచ సరఫరా 43 లక్షల బ్యారెళ్ల వరకు క్షీణించే అవకాశం ఉంది. ముడిచమురు ధరలు పెరగడం వల్ల భారత్‌లో ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు పెరుగుతాయి. రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.
ఐపీఓల జోరు
ఐపీఓ మార్కెట్‌లో బుధవారం ఒక్క రోజే ఆరు మెయిన్‌బోర్డ్ ఇష్యూలు ప్రారంభం కాగా, మొదటి రోజే రెంటోమోజో (1.42 రెట్లు), కరమ్‌తార ఇంజనీరింగ్ (1.27 రెట్లు), ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్ (1.32 రెట్లు) ఐపీఓలు పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. స్టీమ్‌హౌస్ ఇండియా 42 శాతం, ఆర్సిల్ 38 శాతం మేర బిడ్లను పొందగా, మణిపాల్ పేమెంట్ సొల్యూషన్స్ 17 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ ఆరు కంపెనీల ఐపీఓలు సెప్టెంబర్ 11న ముగియనున్నాయి.
మరోవైపు రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఇష్యూ చివరి రోజైన బుధవారం నాటికి ఏకంగా 121 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయి రికార్డు నమోదు చేసింది. మంగళవారం ప్రారంభమైన వాటిలో కనోహర్ ఎలక్ట్రికల్స్ రెండో రోజు నాటికి 10.22 రెట్లు, గ్లాస్ వాల్ సిస్టమ్స్ 8.22 రెట్ల స్పందనతో దూసుకుపోతుండగా, ప్రసోల్ కెమికల్స్ 72 శాతం మేర సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
