కేటీఆర్ సైగ చేయగానే మహిళా ఎమ్మెల్యేలను తోసేశారు: మంత్రి సీతక్క 

కేటీఆర్ సైగ చేయగానే మహిళా ఎమ్మెల్యేలను తోసేశారు: మంత్రి సీతక్క 
  • కేటీఆర్ వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణ.. వీడియోలు విడుదల సబిత, కోవా లక్ష్మి 
  • మధ్యలోకి దూరి నెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్న  
  • మహిళా కానిస్టేబుల్ నడుంపై కేటీఆర్ చెయ్యేసి నెట్టేశాడని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ గేటు వద్ద బీఆర్​ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలే అత్యంత అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బుధవారం ఆమె విడుదల చేశారు. కేటీఆర్ సైగ చేయగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మిల మధ్యలోకి దూరి.. వారిని వెనుక నుంచి నెట్టుకుంటూ ముందుకు వెళ్లడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని  తెలిపారు.

ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు పక్కపక్కనే నిల్చుంటే వారి మధ్యకు చొరబడాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను తాకుతూ, నెడుతూ ముందుకు దూసుకెళ్లడం ఏం సంస్కారమన్నారు. రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా? అని సీతక్క నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళల గౌరవం గురించి బయట నీతులు చెప్పే బీఆర్ఎస్ నేతలు, ముందు తమ సొంత ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

మహిళా ఎమ్మెల్యేలనే కాకుండా, బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా పోలీసులతో కూడా బీఆర్ఎస్ నేతలు దారుణంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ నడుముపై స్వయంగా కేటీఆర్ చేయి వేసి తోసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలను, విధుల్లో ఉన్న మహిళా పోలీసులను గౌరవించలేని బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రంలో మహిళా రక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీ గేటు వద్ద ఎవరు ఎవరిని తోశారో వీడియోల్లో   స్పష్టంగా ఉందని, నిజమేంటో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో పీఆర్ చట్ట సవరణ బిల్లు

గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణలో ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలకు చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంచాయతీల సొంత ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా సమీప బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే జమ చేసుకునే అవకాశం దక్కనుంది. ఇందుకు సంబంధించిన ‘తెలంగాణ పంచాయతీ రాజ్ (నాల్గవ సవరణ) చట్టం- 2026’ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

దీనిపై గురువారం చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. గ్రామ పంచాయతీలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ట్రెజరీలోనే జమ చేయాల్సి వచ్చేది. అయితే, ట్రెజరీ నుంచి ఆ నిధులను డ్రా చేసుకునే క్రమంలో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నిధులు ల్యాప్స్ కావడం లేదా ఇతర అవసరాలకు డైవర్ట్ అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనివల్ల పల్లెల్లో తాగునీటి సరఫరా, మోటార్ల రిపేర్లు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ వంటి అత్యవసర పనులకు కూడా నిధులు సమయానికి అందక సర్పంచులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గ్రామాల్లో అత్యవసర సమస్యలు తలెత్తినప్పుడు చేతిలో పైసలు లేక పాలన స్తంభించిపోయేది. తాజా సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే గ్రాంట్లు, పంచాయతీల సొంత ఆదాయంతో కలిపి మొత్తం నిధులను సమీపంలోని జాతీయ బ్యాంకు (నేషనలైజ్డ్ బ్యాంక్), సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు.