వెరైటీ దొంగ: ఈఎంఐ ఎంతుంటే..అంతే చోరీ.. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన.

 వెరైటీ దొంగ: ఈఎంఐ ఎంతుంటే..అంతే చోరీ..  సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన.
  •  రూపాయి ఎక్కువ కనిపించినా ముట్టుకోడు..
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

సూర్యాపేట, వెలుగు : నెలలో తాను కట్టాల్సిన ఈఎంఐ ఎంతుందో లెక్కేసుకొని, అంతే మొత్తం.. అది కూడా సూర్యాపేట జిల్లా కోదాడలోనే దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ నరసింహ బుధవారం జిల్లా ఆఫీస్ లో వెల్లడించారు.
 

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టకు చెందిన పట్నంశెట్టి రాజుకు గతంలో నాలుగు డీసీఎంలు ఉండేవి. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన రాజు అప్పులు, ఈఎంఐల ఊబిలో కూరుకుపోయాడు. ఈ క్రమంలో డీసీఎంలను అమ్మేసుకొని చివరకు కారు డ్రైవర్ గా పనిచేయడం ప్రారంభించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న రాజు 2009 నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 

2012 నుంచి సూర్యాపేట జిల్లా కోదాడను టార్గెట్ గా చేసుకొని సంపన్నులు ఉండే ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీ చేయడం ప్రారంభించాడు. తాళం వేసిన ఇండ్లు, వ్యాపార సముదాయాల వద్ రెక్కీ నిర్వహించి, ఏ ఇంట్లో ఎంత బంగారం, డబ్బులు ఉండే అవకాశం ఉందో ముందే అంచనా వేసుకొని, రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడేవాడు. ఈ క్రమంలో నెలలో తాను కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ ఎంత ఉందో లెక్కేసుకొని సరిగ్గా అంతే మొత్తాన్ని చోరీ చేసేవాడు. 

చోరీకి వెళ్లిన ఇంట్లో తన ఈఎంఐ కంటే ఎక్కువ డబ్బులు కనిపించినా వాటిని ముట్టుకునేవాడు కాదు. అలాగే డబ్బులు తీసుకుంటే బంగారాన్ని వదిలేయడం, బంగారాన్ని తీసుకుంటే డబ్బులను వదిలేయడం చేసేవాడు. ఇలా కోదాడలోనే పది వరకు చోరీలు చేశాడు. చోరీ చేసిన బంగారాన్ని కోదాడలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

అతడి నుంచి రూ.60 లక్షల విలువైన 37 తులాల బంగారం, అరకేజీ వెండి, రూ. 3.6 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శివ కుమార్, కోదాడ పట్టణ ఇన్ స్పెక్టర్ శివంశంకర్, సీసీఎస్ ఎస్సైలు హరికృష్ణ, సాయిరాం, ఎస్సై అజయ్ కుమార్ ను ఎస్పీ 
అభినందించారు.