కోదాడ ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం.. కండక్టర్‌పైకి దూసుకెళ్లిన బస్సు

కోదాడ ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం.. కండక్టర్‌పైకి దూసుకెళ్లిన బస్సు

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డిపో ప్రాంగణంలో బస్సు కండక్టర్‌పైకి బస్సు దూసుకెళ్లడంతో కొమ్ము కోటయ్య అనే కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

డిపోలో బస్సు నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న మెకానిక్ బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బస్సు అదుపు తప్పి కండక్టర్ కొమ్ము కోటయ్యపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే తోటి సిబ్బంది కోటయ్యను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డిపో ప్రాంగణంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడిపించడం వంటి అంశాలపై కార్మిక సంఘాల నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.సిబ్బంది భద్రత విషయంలో డిపో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.