కులం అంతం అయినప్పుడు.. రిజర్వేషన్లు వదులుకుంటాం : కేంద్ర మంత్రి అథవాలే

కులం అంతం అయినప్పుడు.. రిజర్వేషన్లు వదులుకుంటాం : కేంద్ర మంత్రి అథవాలే

దేశంలో రిజర్వేషన్లపై కొత్త చర్చ నడుస్తుందని.. రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించటం సరికాదన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. కులతత్వం అంతం అయినప్పుడు.. మేం రిజర్వేషన్లు వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాం.. అలా కాకుండా కులాలు ఉన్నప్పుడు.. కుల వివక్ష ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉండటంలో తప్పులేదన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రి అథవాలే. అయితే, రిజర్వేషన్లను వ్యతిరేకించడం మాత్రం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు.

1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించగా, 1990-91లో వి.పి. సింగ్ హయాంలో ఓబీసీలకు కోటాలు వచ్చాయని, అలాగే మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలు చేస్తుంటారని, వారి అబద్ధపు మాటలను యువత (జెన్ జెడ్) నమ్మవద్దని ప్రధాని మోదీ చెప్పిన మాటలను అథవాలే సమర్థించారు. దేశ ప్రగతి కోసం ప్రతిపక్షాలు కూడా సహకరించాలని, కానీ నేడు ప్రతిపక్షం కేవలం విమర్శలు చేసే సంస్థగా మారిపోయిందని విమర్శించారు.

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 5 కొత్త మెడికల్ కాలేజీలు, కోర్బాలో రూ. 130 కోట్లతో ఇండియన్ ఆయిల్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ALSO READ : గవర్నర్‎కు అన్నీ విషయాలు చెప్పేశాం..

  ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు కోటికి పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, 41 లక్షలకు పైగా కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. అలాగే పీఎం-కిసాన్ ద్వారా 25 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, జన్ ధన్ ఖాతాలు, ముద్రా లోన్లు, ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా పేదలకు కేంద్రం అండగా నిలుస్తోందని అథవాలే వివరించారు.