ముంబై-గోవా హైవే(NH-66) రిపేర్లను 'ఎం-సీల్'తో చేస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా పూర్తి కాకుండా నానాపాట్లు పడుతున్న ఈ కీలక రహదారిపై జరుగుతున్న ఈ తాత్కాలిక పనులను చూసి ప్రయాణికులు విస్తుపోతున్నారు. అసలే ఆలస్యం, భారీ ఖర్చులతో కుంటుపడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో.. గుంతలను పూడ్చడానికి సిమెంట్ లేదా తారుకు బదులు ఏకంగా చిన్న చిన్న రిపేర్లకు వాడే ఎం-సీల్ వాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇదేంట్రా బాబు, హైవేలకు కూడా ఎం-సీల్ పూస్తున్నారా?" అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
కేవలం ముంబై-గోవా హైవే మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణ నాణ్యతపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పాట్నా-బక్సర్ ఫోర్-లేన్ హైవే(NH-922)లోని ఆరా-బక్సర్ సెక్షన్‌కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొత్తగా నిర్మించిన రోడ్డు కొద్దిరోజులకే పగిలిపోవడంతో, కార్మికులు డ్రిల్లింగ్ చేసి స్టీల్ రాడ్లు ఇరికించి రిపేర్లు చేస్తున్న దృశ్యాలు అందర్నీ విస్మయానికి గురిచేశారు. అయితే అప్పటి వీడియోపై అది కావాలని చేసిందంటూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లారిటీ కూడా ఇచ్చింది.
కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించే నేషనల్ హైవేలు కొన్ని నెలలకే దెబ్బతినడం, వాటికి శాశ్వత పరిష్కారాలు వెతకకుండా కాంట్రాక్టర్లు ఇలాంటి పైపైన చేసే డొల్ల పనులతో కాలం వెళ్లదీయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తాత్కాలిక సర్జరీల వల్ల రోడ్ల మన్నిక ఏపాటిదో అర్థమవుతోందని వాహనదారులు మండిపడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత శాఖలు కఠినమైన విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి పేరిట సాగుతున్న ఈ అక్రమాలు, నిస్సారమైన పనులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు. మెుత్తానికి ఈ వీడియోల్లో ఉన్నది ఎంత వరకూ వాస్తవం అనేది తేలాల్సి ఉంది.
वाह... क्या सीन है! pic.twitter.com/ErzVj6bP6W
— Congress (@INCIndia) September 9, 2026
