హైదరాబాద్: ఉప్పల్ భారత్‌నగర్ కాలనీలోని ఎస్‌ఎల్‌వీ బెంగళూరు అయ్యంగార్ బేకరీపై ఎం-ఫాస్ట్, ఎస్‌ఓటీ ఉప్పల్ బృందం దాడులు నిర్వహించింది. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే బేకరీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
బేకరీ పరిసరాలను అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా బేకరీ నిర్వాహకుడు కెంపెగౌడ దేవరాజ్ నవీన్ వద్ద నుంచి గడువు ముగిసిన కేక్ మిక్స్, క్రంబ్ పౌడర్, ఫ్రూట్ పవర్, కేక్ ఇంప్రూవర్లు, పలు రకాల సింథటిక్ ఫుడ్ కలర్స్, ఫ్లేవర్స్ తదితర పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
