అసెంబ్లీలో దళితుల అంశంపై దుమారం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై మంత్రుల ఫైర్

అసెంబ్లీలో దళితుల అంశంపై దుమారం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై మంత్రుల ఫైర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దళితుల అంశంపై అధికార కాంగ్రెస్, బీజేపీ ,బీఆర్ ఎస్ ప మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభలో జరిగిన పరిణామాలు, దళితులను అవమానించేలా జరిగిన ఘటనలపై మంత్రులు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా స్పందించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దళితులు వెళ్లిన ప్రాంతాలను శుద్ధి చేస్తే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సభ ఎన్ని రోజులైనా నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సమాజంలో పెద్ద సామాజిక సమస్యలు జరిగినప్పుడు బీజేపీ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. డప్పుతో నిరసన చేయడం వెనుకబడిన వర్గాల ఉద్యమ సంస్కృతిలో భాగమని అన్నారు. దళితులు వెళ్లిన ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆలయానికి వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ భావజాలం ఒక్కటేనని విమర్శించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణకు బీజేపీ ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలని బీజేపీ నేతలకు సూచించారు. బీజేపీ నేతల మానసిక పరిస్థితి బాగోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. అసెంబ్లీ చర్చలకు బీజేపీ సహకరించాలని కోరారు. రూ.22 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై చర్చిద్దామని స్పీకర్ చెప్పారని తెలిపారు.ఉత్తరాఖండ్‌లో ఖర్గే గుడికి వెళ్లిన సమయంలో అక్కడ శుద్ధి కార్యక్రమం నిర్వహించారని కూనంనేని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. అసభ్యకరమైన భాషను ఉపయోగించడం ఎవరికీ మంచిది కాదన్నారు. చావులు కోరడం, పిండ ప్రదానాలు చేయడం వంటి చర్యలు సరికాదని వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్‌లోని కుల అహంకారానికి శుద్ధి కార్యక్రమం నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జరిగిన ఘటన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దళితులు ఉండకూడదనే ఉద్దేశం బీఆర్ఎస్‌లో కనిపిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.