BCCI ప్రభుత్వ పరిధిలోకి ఎందుకు రాకూడదు.. సుప్రీంకోర్టు ప్రశ్నతో డైలామాలో క్రికెట్ బోర్డు

BCCI ప్రభుత్వ పరిధిలోకి ఎందుకు రాకూడదు.. సుప్రీంకోర్టు ప్రశ్నతో డైలామాలో క్రికెట్ బోర్డు

Supreme Court Notice to BCCI: అత్యంత ధనిక క్రీడా సంస్థ అయిన బీసీసీఐ (BCCI)తో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ క్రీడా పాలనా చట్టం 2025 ( (National Sports Governance Act - NSA) పరిధిలోకి బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఎందుకు రాకూడదో పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని సీజేఐ జస్టిస్ సూర్యా కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. బీసీసీఐ పరిపాలనపై పలు క్రికెట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన న్యాయస్థానం, ప్రస్తుతం ఎన్ఎస్ఏ పరిధిలో బీసీసీఐ లేకపోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

పారదర్శకత కోసమే ఎన్ఎస్ఏ.. బీసీసీఐపై పాత కేసులు: 

భారతదేశంలోని అన్ని క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర సర్కార్ ఎన్ఎస్ఏ 2025 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మిగిలిన జాతీయ క్రీడా సమాఖ్యలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తున్నప్పటికీ, బీసీసీఐకి మాత్రం మినహాయింపు లభించింది. 2014 నుంచి బీసీసీఐ పరిపాలనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఉండటంతో పాటు లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా అనేక సంస్కరణలని తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర క్రికెట్ సంఘాల రాజ్యాంగ మార్పులు, అంతర్గత పరిపాలనా వివాదాల కేసులు అన్నీంటిని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ అవుతున్నాయి. 

స్వతంత్ర ప్రతిపత్తి వర్సెస్ కేంద్ర ప్రభుత్వ సపోర్ట్: 

సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన బీసీసీఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో దీని నిర్ణయాల్లో డైరెక్టుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ విదేశీ మ్యాచ్‌లకు పర్మిషన్లు, పన్నుల అంశాలు, ప్రభుత్వ క్రీడా విధానాల విషయంలో బీసీసీఐ ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసే పని చేయాల్సిందే. అలాగే బీసీసీఐపై కోర్టుల పరిధి మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బీసీసీఐని కూడా ఇతర సమాఖ్యల మాదిరిగానే ఎన్ఎస్ఏ పరిధిలోకి తీసుకు రావాలనే ఆదేశాలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఆఫీస్ బేరర్ల పదవులకు గండం: 

2014 నుంచి బీసీసీఐ పాలనా విధివిధానాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది. గతంలో మాజీ సీజేఐ జస్టిస్ ఆర్‌ఎమ్ లోధా నేతృత్వంలో కమిటీని వేసి బీసీసీఐ రాజ్యాంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జాతీయ క్రీడా చట్టం (NSA 2025) పరిధిలోకి బీసీసీఐని కూడా చేర్చితే, బోర్డు స్వయంప్రతిపత్తిపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. ఇతర క్రీడా సమాఖ్యల మాదిరిగానే బీసీసీఐ కూడా ప్రభుత్వ క్రీడా చట్టం పరిధిలోకి వస్తే, ఏళ్ల తరబడి అధికార పీఠాల్లో తిష్టవేసిన బోర్డు పెద్దల అధికారాలకు గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది.

12 ఏళ్ల నిబంధన, కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై నీలినీడలు: 

సెప్టెంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ రాష్ట్ర అసోసియేషన్‌లో 6 ఏళ్లు, బీసీసీఐలో 6 ఏళ్లు కలిపి వరుసగా 12 ఏళ్లు పని చేసిన తర్వాతే మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తిస్తుంది. కానీ, ఒకవేళ బీసీసీఐ ఎన్ఎస్ఏ (NSA 2025) చట్టం పరిధిలోకి వస్తే, ఈ 12 ఏళ్ల మినహాయింపులు రద్దయి మరింత కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ బోర్డుల్లో కీలక పదవుల్లో ఉన్న అధికారుల పీఠాలు కదిలే ప్రమాదం ఉంది. 

ప్రభుత్వ జోక్యం ఉంటే ఐసీసీ బ్యాన్ ముప్పు: 

ఒకవేళ బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం (NSA 2025) పరిధిలోకి తీసుకువస్తే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రూల్స్ ప్రకారం చాలా పెద్ద సమస్య ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం సభ్య దేశాల క్రికెట్ బోర్డుల పాలనలో ఏ ఒక్క దేశానికి చెందిన ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. ఒకవేళ బోర్డుపై ప్రభుత్వ ప్రత్యక్ష ఆధిపత్యం ఉన్నట్లు తేలితే సదరు క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం (Ban) విధించే అవకాశం క్లియర్ గా ఉంటుంది. అలా కానీ జరిగితే టోర్నీల నిర్వహణ హక్కులను కూడా బీసీసీఐ కోల్పోయే ఛాన్స్ ఉంది. దీంతో సుప్రీంకోర్టు విచారణలో బీసీసీఐ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందోనని క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుంది.