ఎక్కువగా అప్పులు తీసుకుంటున్న జెన్-జెడ్ కుర్రోళ్లు, గ్రామీణ ప్రజలు.. ఎందుకంటే?

ఎక్కువగా అప్పులు తీసుకుంటున్న జెన్-జెడ్ కుర్రోళ్లు, గ్రామీణ ప్రజలు.. ఎందుకంటే?

మన దేశంలో రిటైల్ క్రెడిట్ మార్కెట్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. యువత, గ్రామీణ ఫ్యామిలీస్, అనధికారిక రంగాల కార్మికులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రమంగా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. 2026 జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని మొత్తం 14 కోట్ల రిటైల్ క్రెడిట్ ఆరిజినేషన్లలో యాస్పిరేషనల్ బారోవర్స్ వాటా ఏకంగా 79 శాతంగా నమోదైందని ఈక్విఫాక్స్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలే మొత్తం అప్పుల్లో 73 శాతాన్ని హోల్డ్ చేస్తున్నాయి. 

ఈ కొత్త క్రెడిట్ కి ప్రధాన చోదక శక్తిగా Gen Z, మిల్లెనియల్స్ నిలుస్తున్నారు. చాలా మంది యూత్ ఈ అప్పులను లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవటానికి, రోజువారీ ఖర్చులు, ఆదాయ వృద్ధి కోసం విస్తృతంగా వినియోగిస్తోంది. లైఫ్‌స్టైల్ సీకర్స్‌లో 68% మంది ఫిన్‌టెక్ యాప్‌లపై ఆధారపడుతుండగా, ప్రారంభ క్రెడిట్ తీసుకునే వారిలో Gen Z వాటా 55 శాతంగా ఉంది. వీరు చిన్న మొత్తాల పర్సనల్ లోన్లు, బై-నౌ- పే లేటర్ సేవలను ఉపయోగించుకుంటూ తమ క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకుంటున్నారట.

గ్రామాలు, మహిళా పారిశ్రామికవేత్తలు ఈ క్రెడిట్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్, గోల్డ్ లోన్లు, వ్యవసాయ రుణాల ద్వారా గ్రామీణ భారత్ ముందుకు వెళ్తుండగా.. చిన్న వ్యాపారాల విస్తరణకు మహిళలు అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్లను ఆశ్రయిస్తున్నారు. ఎమర్జింగ్ మైక్రో-వెంచర్స్‌లో మహిళల వాటా 78 శాతంగా ఉంది. సాంప్రదాయ జీతం తాలూకు డాక్యుమెంట్లు లేకపోయినా.. UPI లావాదేవీలు, జీఎస్టీ డేటా, అకౌంట్ అగ్రిగేటర్ల ద్వారా లభించే డిజిటల్ సిగ్నల్స్ ఆధారంగా లెండర్లు లోన్స్ ఆఫర్ చేస్తున్నారు.

ALSO READ : ముంబై-గోవా హైవే రిపేర్లకు ఎం-సీలా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

ఈ వేగవంతమైన అప్పుల విస్తరణలో కొన్ని ఆర్థిక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. మొత్తం రిటైల్ రుణాల్లో 58.4 శాతం అన్‌సెక్యూర్డ్ లోన్స్ కాగా, చిన్న మొత్తాల లోన్లపై డిఫాల్ట్ రేట్లు ఆందోళనకరంగా ఉంటున్నాయి. సో కంపెనీలు కేవలం రుణాల వేగంపై కాకుండా.. బాధ్యతాయుతమైన అండర్‌రైటింగ్, పారదర్శకమైన ఈఎంఐ స్ట్రక్చర్‌లపై లెండర్లు దృష్టి పెట్టాలని నివేదిక సూచిస్తోంది. AI, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ రాకతో రుణాలు మంజూరు చేసే సమయం నిమిషాల్లోకి పడిపోయింది. దీంతో అప్పు కావాలంటే కనురెప్పపాటులో దొరుకుతోంది నేటితరం కుర్రోళ్లకు.