రాముడి కంటే రావణుడికే ఎక్కువ లాభాలా?.. 'రామాయణ'లో యష్‌ మాస్టర్‌ప్లాన్‌!

రాముడి కంటే రావణుడికే ఎక్కువ లాభాలా?.. 'రామాయణ'లో యష్‌ మాస్టర్‌ప్లాన్‌!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న దృశ్యకావ్యం ' రామాయణ'( Ramayana ) . స్టార్‌ కాస్ట్‌, భారీ బడ్జెట్‌, ఇంటర్నేషనల్‌ స్థాయి విజువల్స్‌తో రూపొందుతున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 'దంగల్' నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ లంకేశ్వరుడు రావణాసురుడిగా నటిస్తున్నారు.

అయితే, ఈ ప్రాజెక్ట్‌లో నటీనటుల పారితోషికాలకు సంబంధించి ఓ సంచలన వార్త సినీ ట్రేడ్ వర్గాల్లో షేక్ చేస్తోంది. రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌కు రెండు భాగాలకు కలిపి సుమారు రూ.150 కోట్ల పారితోషికం అందుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి దాదాపు రూ.75 కోట్లు అన్నమాట. సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవికి కూడా ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ పారితోషికం అందినట్లు సమాచారం. కానీ.. రావణుడిగా వస్తున్న యష్‌ మాత్రం ఫిక్స్‌డ్‌ రెమ్యునరేషన్‌ తీసుకోలేదట.

'కేజీఎఫ్‌'తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్‌ మొదట ఈ పాత్ర కోసం సుమారు రూ.100 కోట్ల పారితోషికం తీసుకునేలా డీల్‌ కుదిరిందని సమాచారం. అయితే తర్వాత తన పారితోషికాన్ని ప్రాజెక్టులోనే పెట్టుబడిగా పెట్టి నిర్మాతగా భాగస్వామిగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 'రామాయణ'కు సంబంధించిన దక్షిణ భారత డిస్ట్రిబ్యూషన్‌,డబ్బింగ్‌ హక్కుల్లో యష్‌కు వాటా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.. దీంతో ఇక్కడే అసలు లెక్క మొదలవుతుంది. సినిమా దక్షిణాది మార్కెట్లలో భారీగా వసూళ్లు సాధిస్తే.. యష్‌కు వచ్చే వాటా రూ.150 కోట్లను కూడా దాటే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అదే జరిగితే.. స్క్రీన్ పై రాముడిగా కనిపించే హీరో రణ్‌బీర్‌ కంటే రావణుడిగా నటించే విలన్ పాత్రధారి యష్‌ ఈ సినిమాతో ఎక్కువ సంపాదించిన స్టార్‌గా నిలిచే ఛాన్స్‌ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక 'రామాయణ'ను కేవలం స్టార్‌ సినిమా కాకుండా ప్రపంచస్థాయి భారతీయ ఇతిహాసంగా తెరకెక్కించేందుకు మేకర్స్‌ భారీగా ఖర్చు చేస్తున్నారు. సూమారు రూ. 4వేల కోట్లకు పైగా బడ్జెట్ తో  అంతర్జాతీయ టెక్నీషియన్లు, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌, భారీ సెట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

నవంబర్‌ 6, 2026న దీపావళి కానుకగా తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. రెండో భాగం అనంతరం విడుదల కానుంది. మొత్తానికి.. తెరపై రాముడు– రావణుడు తలపడకముందే.. రెమ్యునరేషన్‌ విషయంలో రణ్‌బీర్‌– యష్‌ మధ్య మరో 'యుద్ధం' మొదలైనట్టే. అయితే యష్‌ అసలు సంపాదన ఎంతన్నది సినిమా విడుదల తర్వాత దక్షిణాది మార్కెట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.