బాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ 'దృశ్యం'. స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన తొలి రెండు భాగాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ముఖ్యంగా రెండో భాగం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూడో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజ్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ.. తెరకెక్కుతున్న 'దృశ్యం: ది కంక్లూజన్' మూవీని మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ గా గోవాలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్ లో గ్రాండ్‌గా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే ఈసారి విజయ్ సాల్గావ్‌కర్ కుటుంబానికి అసలు పరీక్ష మొదలైనట్లు స్పష్టమవుతోంది. గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి కొత్త ఆధారాలను సంపాదించిన మీరా దేశ్‌ముఖ్.. విజయ్, అతని కుటుంబాన్ని ఎలాగైనా జైలుకు పంపించాలని పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఈసారి ఆమె వ్యూహాలు మరింత పదునుగా కనిపిస్తున్నాయి.
అంతేకాదు.. క్రైమ్ బ్రాంచ్ ఎస్.పి. పాత్రలో జైదీప్ అహ్లావత్ ఎంట్రీతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. కుటుంబ పరువు, భవిష్యత్తును దెబ్బతీస్తానంటూ విజయ్‌ను అతడు హెచ్చరిస్తాడు. అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఓ సాధారణ వ్యక్తి ఎంతటి శక్తిగా మారగలడో విజయ్ మరోసారి చూపించబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది.
ట్రైలర్‌లో డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల పెర్ఫార్మెన్స్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా వేగంగా సాగే కథనం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంది. ప్రతి ఆధారం వెనుక మరో ట్విస్ట్ దాగి ఉన్నట్టుగా చూపించడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
మలయాళ 'దృశ్యం' మూడో భాగానికి సీన్-బై-సీన్ రీమేక్‌గా కాకుండా పూర్తిగా కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్, స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈసారి విజయ్ సాల్గావ్‌కర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే..
