ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరో బోల్డ్ అండ్ రొమాంటిక్ ధమాకాకు రెడీ అయింది. ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఆంథాలజీ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 3' అధికారిక ట్రైలర్ ను లేటెస్ట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆధునిక కాలంలో ప్రేమ, శారీరక కోరికలు, మానవ సంబంధాలలోని సంక్లిష్ట భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం.. మొదటి రెండు భాగాల (2018, 2023) కంటే మరింత బోల్డ్‌గా, వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్ తో స్పష్టమవుతోంది.
ఈసారి 'లస్ట్ స్టోరీస్ 3'లో ఏకంగా నలుగురు క్రేజీ ఫిల్మ్‌మేకర్స్ తమదైన స్టైల్లో నాలుగు విభిన్న కథలను చెప్పబోతున్నారు. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ నాలుగు కథలు.. మనుషుల మధ్య ఉండే కోరికలు, సంబంధాల్లోని సంక్లిష్టత, ఊహలు, అసంతృప్తి, అనూహ్య పరిణామాల చుట్టూ తిరుగుతాయి.
ట్రైలర్లో కొంకణా సేన్ శర్మ, రాధికా ఆప్టే కనిపించే కథ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మధ్యతరగతి జీవితంలో కొత్త అనుభవాల కోసం ఆలోచించే ఇద్దరు ప్రొఫెషనల్స్ కథగా ఇది కనిపిస్తోంది. మరో కథలో భిన్నమైన సంస్కృతులు, సామాజిక నేపథ్యాలకు చెందిన ఇద్దరు యువకులు ప్రేమలో పడినా.. వారి కోరికలు, అంచనాలు ఒకేలా లేకపోవడం కొత్త సమస్యలకు దారితీస్తుంది.
హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన విశాల్ భరద్వాజ్ కథలో అదితి రావు హైదరి ఓ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారు. వివాహ జీవితంలో తీరని కోరికలను ఆమె తన రచనలు, ఊహల ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించే పాత్రలో కనిపిస్తారు. ఇక అలీ ఫజల్, రాధికా మదన్ జంటగా నటించిన కథ మాత్రం దాంపత్యంలో తలెత్తే విభేదాలు, నెరవేరని అంచనాలపై మరింత ఎమోషనల్‌గా సాగనున్నట్టు తెలుస్తోంది.
►ALSO READ | నార్త్ అమెరికాలో నాని 'ది ప్యారడైజ్' జాతర.. గంటల్లోనే లక్ష డాలర్లను దాటిన ప్రీ-సేల్స్!
ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ, సిద్ధార్థ్, అభిషేక్ బెనర్జీ, గుర్ఫతేహ్ పీర్జాదా, సనా తంపి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో మొదలైన ఈ ఆంథాలజీ సిరీస్‌కు 2023లో వచ్చిన రెండో భాగం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మూడో భాగం మరింత బోల్డ్ కంటెంట్‌తో.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ మ్యూజిక్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ లస్ట్ సీక్వెల్‌పై అంచనాలను పెంచేశాయి. ఈ మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ డ్రామా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన 'లస్ట్ స్టోరీస్ 3'.. ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..
