- ఆర్‌మాక్స్ మీడియా తాజా నివేదిక వెల్లడి
సినిమాలు, వెబ్ సిరీస్‌లు,టీవీ షోలను వీక్షకులకు అందించే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఓటీటీ కి రోజురోజుకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది. కేబుల్, శాటిలైట్ కనెక్షన్ తో సంబంధం లేకుండా నేరుగా ఇంటర్నెట్ ద్వారా మనకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఓవర్ ది టాప్ (OTT)..సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడటానికి థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్న మొబైల్ లేదా ఇంట్లోని స్మార్ట్ టీవీతోనే ఎప్పుడంటే అప్పుడు కంటెంట్ చూసే అవకాశం ఉండటంతో ఓటీటీ కల్పిస్తోంది.
తాజా ఆర్‌మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. భారత్‌లో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య ఏకంగా 66.49 కోట్లకు చేరింది. అంటే దేశ జనాభాలో దాదాపు 45 శాతం మంది ఆన్‌లైన్ వీడియో కంటెంట్ చూస్తున్నారన్నమాట. గతేడాది 60.12 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఏడాదిలోనే 11 శాతం పెరిగింది. ఇక ఓటీటీకి డబ్బులు చెల్లించి తీసుకున్న యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్లు 17.26 కోట్లకు చేరాయి. గతేడాది 14.82 కోట్లుగా ఉన్న సబ్‌స్క్రిప్షన్లతో పోలిస్తే 16 శాతం అధికం.
అయితే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న విషయం స్మార్ట్ టీవీల్లో ఓటీటీ వ్యూవర్స్ పెరగడం. కనెక్టెడ్ టీవీ యూజర్ల సంఖ్య 20.69 కోట్లకు చేరింది. ఏడాదిలోనే ఏకంగా 60 శాతం పెరిగిందంటే నమ్మశక్యం లేదు. అంటే మొబైల్‌లో మాత్రమే కాకుండా ఇప్పుడు కుటుంబంతో కలిసి టీవీలో ఓటీటీ చూసే అలవాటు కూడా పెరుగుతోంది.
ALSO READ : రాముడి కంటే రావణుడికే ఎక్కువ లాభాలా?.. 'రామాయణ'లో యష్ మాస్టర్‌ప్లాన్!
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఒక్కో ప్రేక్షకుడు వారానికి సగటున 14.9 గంటలు ఆన్‌లైన్ వీడియోలు చూస్తున్నారు. సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు, మైక్రో డ్రామాలు, ఫాస్ట్ ఛానెళ్ల వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు.
మొత్తంగా భారతీయుల ఎంటర్‌టైన్‌మెంట్ అలవాట్లు ఊహించనతంగా వేగంగా మారుతున్నాయి. మొబైల్, స్మార్ట్ టీవీ.. ఈ రెండు స్క్రీన్లే ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతున్నాయి.
