హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం (సెప్టెంబర్ 9) కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యింది. అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ భేటీ అనంతరం లోక్ భవన్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభ లోపల జరిగిన విషయాలపై నేను చర్యలు తీసుకోలేనని గవర్నర్ చెప్పారు. కానీ శాసనసభ బయట జరిగిన వ్యవహారాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని మాకు హామీ ఇచ్చారని తెలిపారు. డీజీపీ, అధికారులను పిలిపించుకుని మాట్లాడతానని చెప్పారన్నారు. గవర్నర్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిస్థితులను గవర్నర్‌కు వివరించామని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు దాడి చేసిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై పురుష పోలీసులు దాడి, సునీతా లక్ష్మా రెడ్డి చీర లాగిన వీడియోలను గవర్నర్‌కు చూపించామని చెప్పారు.
కేసీఆర్ చావు కోరుతూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్ హౌస్ పైకి గుండాలను పోలీసులు స్వాగతించిన తీరును గవర్నర్‌కు వివరించామన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ప్రజాప్రతినిధులకు అవమానాలేనన్నారు. హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టిన ఈ ప్రభుత్వానికి బుద్ధి మారడం లేదు.
మేము చేసిన తప్పేంటి ప్రభుత్వానికి నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్తాడు.. మేం అలాగే బ్లాక్ టీ షర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్లాం ఇందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. మాపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు.. అసలు మేం చేసిన తప్పేంటని ప్రశ్నించారు.
