వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. పాదయాత్ర వైసీపీ సక్సెస్ ఫార్ములా కావడంతో.. జగన్ మళ్లీ పాదయాత్రతో జనానికి చేరువై సీఎం కావడం ఖాయమని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకూ ఎండనక, వాననక పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర 3వేల 648 కిలోమీటర్లకు పైగా సాగింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 500 బహిరంగ సభలు నిర్వహించారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ పాదయాత్రకు విశేష ఆదరణ దక్కింది.
►ALSO READ | తిరుపతి జిల్లాలో చిరుతల కలకలం..చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో తరచూ సంచారం..!
2019 ఎన్నికలకు ముందు మొత్తం 341 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర జరిగిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టడం, జగన్ 2.0 పేరుతో జనంలోకి వెళుతుండటంతో ఏపీ రాజకీయాల్లో జగన్ పాదయాత్ర నిర్ణయం మరోసారి చర్చనీయాంశమైంది.
