బ్రిటన్‌లో ఒక్కసారిగా 1,300 ఫ్లైట్స్ రద్దు.. నిలిచిపోయిన రాకపోకలు.. చిక్కుల్లో ప్రయాణికులు !

బ్రిటన్‌లో ఒక్కసారిగా 1,300 ఫ్లైట్స్ రద్దు.. నిలిచిపోయిన రాకపోకలు.. చిక్కుల్లో ప్రయాణికులు !

యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఫ్లయిట్ జర్నీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. దింతో దేశవ్యాప్తంగా సుమారు 1,300 విమానాలు రద్దు కావడంతో వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

బ్రిటన్‌లోని  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంస్థ అయిన 'NATS' ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్‌లో అకస్మాత్తుగా సమస్య తలెత్తింది. దీంతో హీత్రూ, గాట్విక్, మాంచెస్టర్, లివర్‌పూల్, బర్మింగ్‌హామ్, ఎడిన్‌బరో వంటి దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలతో పాటు  ఐర్లాండ్ డబ్లిన్ ఎయిర్‌పోర్టులోనూ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దింతో  మొత్తంగా 1,300 వరకు విమానాలు రద్దు కాగా, లండన్‌లో ఒక్క బుధవారమే 177 విమానాలు నిలిచిపోయాయి.

ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు NATS  ప్రకటించింది. సిస్టమ్ యథావిధిగా పనిచేస్తున్నప్పటికీ, అంతకుముందు నిలిచిపోయిన విమానాల రాకపోకలను అడ్జస్ట్  చేయడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితికి  ప్రయాణికులకు తీవ్ర నిరాశ మిగిల్చిందని, దీనికి  క్షమాపణలు కోరుతున్నామని ఎన్‌ఏటీఎస్ వెల్లడించింది. యూకేలో అత్యంత రద్దీగా ఉండే హీత్రూ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది సరైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో విమాన సంస్థలు సర్వీసులను రద్దు చేయడం, దారి మళ్లించడం లేదా ఆలస్యం చేయడం వంటివి చేయాల్సి వచ్చింది.

ఈ సమస్య కారణంగా వివిధ విమానయాన సంస్థలు భారీగా నష్టపోయాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ 100కు పైగా విమానాలు రద్దు లేదా దారి మళ్లింపు చేయడంతో వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

రైనాఎయిర్ (Ryanair)  సంస్థకు చెందిన 50కి పైగా విమానాలు రద్దు కాగా, సుమారు 65,000 మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మొత్తం మీద  ప్రయాణికులలో 1 లక్ష 50 వేల మంది ఇబ్బందుల్లో పడ్డారని, 200లకు పైగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని రైనాఎయిర్ తెలిపింది.

ఈజీజెట్  218 విమానాలు రద్దు చేయగ...   కేఎల్‌ఎం 37, యూరోవింగ్స్  22 విమానాలు నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా.. విమానాల సిబ్బంది మారడంతో  కొన్ని సర్వీసులు కూడా ప్రభావం  కావచ్చని, ప్రయాణికులు  ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని హెచ్చరించింది.

►ALSO READ | సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు: పొలిటీషియన్స్ శాలరీలు 60 శాతం పెంపు!

ఈ టెక్నికల్ సమస్య కేవలం ప్రయాణికులనే కాక, క్రీడాకారులను సైతం ఇబ్బంది పెట్టింది. బుధవారం నాపోలీతో జరగాల్సిన ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ కోసం వెళ్లాల్సిన 'ఆర్సెనల్' ఫుట్‌బాల్ టీం విమానం కూడా ఆలస్యం కావడంతో  షెడ్యూల్ చేసిన ప్రెస్ మీట్‌ను క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది.

గతంలోనూ యూకేలో ఇలాంటి సాంకేతిక వైఫల్యాలు (2023లో రాడార్ సమస్య వల్ల 7 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందిపడటం) తలెత్తడంతో, బ్రిటన్ విమాన మౌలిక వసతుల పటిష్టతపై మళ్లీ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైనాఎయిర్ సీఓఓ నీల్ మెక్‌మహాన్ తీవ్రంగా స్పందిస్తూ.. NATS చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ రోల్ఫ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమర్థుడైన వ్యక్తిని బాధ్యతల్లో ఉంచాలని కోరారు. విజ్ ఎయిర్ సంస్థ కూడా విమాన ట్రాఫిక్ నియంత్రణ సంస్థలో తక్షణ మార్పులు రావాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనపై బ్రిటన్ రవాణా శాఖ కార్యదర్శి హైడీ అలెగ్జాండర్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. అయితే, అసలు సిస్టమ్‌లో ఎక్కడ లోపం తలెత్తిందనే దానిపై తమకు ఇంకా స్పష్టత రాలేదని NATS సీఈఓ మార్టిన్ రోల్ఫ్ పేర్కొనడం గమనార్హం.