సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు: పొలిటీషియన్స్ శాలరీలు 60 శాతం పెంపు!

సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి రూ.27 కోట్లు: పొలిటీషియన్స్ శాలరీలు 60 శాతం పెంపు!

రాజకీయ నాయకులకు ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు చెల్లించే దేశంగా పేరుగాంచిన సింగపూర్.. తన మంత్రులు, ప్రధాని జీతాలను మరోసారి భారీగా పెంచింది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తాజాగా పార్లమెంట్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ దేశాల నేతల కంటే ఎంతోఎక్కువగా ఉన్న జీతాలకు ఏకంగా 60 శాతానికి పైగా పెంచాలనుకోవటం గమనార్హం. ప్రతిభావంతులను ఆకర్షించడానికి, దేశంలో అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను అందించడానికే ఈ భారీ వేతనాలు అవసరమని సింగపూర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో వాదిస్తోంది. 

తాజా పెంపుతో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వార్షిక వేతనం మన కరెన్సీలో ఏకంగా రూ.27కోట్లకు పెరిగింది. సాధారణ పౌరులతో పోలిస్తే ఈ వేతనాలు చాలా ఎక్కువని, అందుకే ప్రజలు వీటిని చాలా దగ్గరగా గమనిస్తారని వాంగ్ అన్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల అధ్యక్షుల జీతాలతో పోలిస్తే సింగపూర్ ప్రధాని జీతం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడానికి నాణ్యమైన నాయకత్వం చాలా అవసరమని, మంచి పాలన ఎప్పుడూ మంచి నాయకత్వం పైనే ఆధారపడి ఉంటుందన్నారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత సింగపూర్ ప్రభుత్వం మంత్రివర్గ వేతనాలను సవరించడం ఇదే మొదటిసారి.

►ALSO READ | 8 నెలల్లో 30 శాతం పడిపోయిన HDFC షేరు ధర: అసలు బ్యాంకులో ఏం జరుగుతోంది?

ఈ వేతన సవరణను ఒక స్వతంత్ర కమిటీ సిఫారసు చేసిందని ప్రధాని తెలిపారు. అయితే అందరూ ఒకేసారి ఈ గరిష్ట స్థాయి వేతనాన్ని అందుకోరని స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి వీరందరికీ కేవలం 9 శాతం వరకు మాత్రమే ప్రారంభ సర్దుబాటు ఉంటుంది. ఆ తర్వాత వారి పనితీరు, బాధ్యతల ఆధారంగానే మిగతా మార్పులు ఉంటాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో ఒకటిగా సింగపూర్ నిలవడానికి ఇటువంటి కఠినమైన, పారదర్శకమైన విధానాలే కారణమని అక్కడి ప్రభుత్వం నమ్ముతోంది.