8 నెలల్లో 30 శాతం పడిపోయిన HDFC షేరు ధర: అసలు బ్యాంకులో ఏం జరుగుతోంది?

8 నెలల్లో 30 శాతం పడిపోయిన HDFC షేరు ధర: అసలు బ్యాంకులో ఏం జరుగుతోంది?

దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంక్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ బ్యాంక్ షేరు ధర దాదాపు 1.22 శాతం క్షీణించి రూ.694.35 వద్దకు పడిపోయింది. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లకు కొత్త 52 వారాల కనిష్ట స్థాయి కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. 2026 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ స్టాక్ ఏకంగా 30 శాతం పడిపోయింది. గత నెల రోజుల్లోనే 5.01%, 6 నెలల కాలంలో 17.41% మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ స్టాక్ వరుసగా పడిపోవటానికి ప్రధానంగా బ్యాంక్ లీడర్‌షిప్ మార్పులకు సంబంధించిన అనిశ్చితే ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ తన పదవీ కాలం 2026 అక్టోబర్ 26తో ముగియనున్న నేపథ్యంలో.. పదవీ కాలాన్ని  మళ్లీ పొడిగించుకోవడానికి ఇష్టపడలేదని ప్రకటించారు. ఈ కీలక పరిణామం బ్యాంక్ తదుపరి నాయకత్వంపై పెట్టుబడిదారుల్లో తీవ్ర సందేహాలను, ఆందోళనలను రేకెత్తించింది. మేనేజ్‌మెంట్ స్థాయిలో త్వరలో రాబోయే ఈ పెద్ద మార్పు స్టాక్ ప్రదర్శనపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

నాయకత్వ అనిశ్చితికి తోడు, బ్యాంక్‌ను చుట్టుముట్టిన కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్చి 2026లో బ్యాంక్ మాజీ పార్ట్-టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. దానికితోడు అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై దాఖలైన 'సెక్యూరిటీస్ క్లాస్-యాక్షన్ లాసూట్' కూడా బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసింది.

►ALSO READ | నాకే బ్యాంకులు రూ.6వేల 723 కోట్లు వడ్డీ కట్టాలి.. లెక్కలు బయటపెట్టిన విజయ్ మాల్యా!

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో భారీ విలీనం తర్వాత ఏర్పడిన సవాళ్లను బ్యాంక్ ఇంకా పూర్తిగా అధిగమించాల్సి ఉంది. విలీనానంతరం బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ సాధారణ స్థితికి రావడం, నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోవడం, లోన్ గ్రోత్ మెరుగుపడటంపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టి సారిస్తున్నారు. 2026లో 30 శాతం పడిపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ రాబోయే రోజుల్లో ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది.