మోఖి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ ఇండియా.. జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్–ఎ లీగ్ మ్యాచ్‌లో ఇండియా 15–0తో చైనీస్‌తైపీని చిత్తుగా ఓడించారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో 10 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచింది. తొలి క్వార్టర్‌లో బంతిని ఆధీనంలో ఉంచుకున్న ఇండియా.. చైనీస్‌తైపీ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయాయి.
ఫలితంగా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కానీ తర్వాతి 45 నిమిషాల్లో గోల్స్ వర్షం కురిపించారు. కెప్టెన్ అన్మోల్ ఎక్కా (25, 29, 39, 42, 45, 50వ నిమిషం) ఆరు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచాడు. ఆర్యన్ జెస్ (17, 51, 52వ ని), ప్రభ్‌దీప్ సింగ్ (18వ ని), గుర్సేవక్ సింగ్ (22వ ని), అర్జున్ సంతోష్ (28వ ని), అజిత్ యాదవ్ (35వ ని), హర్పాల్ (48, 53వ ని) మిగతా గోల్స్ అందించారు.
మరో మ్యాచ్‌లో సౌత్ కొరియా 3–2తో జపాన్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టైటిల్‌కు దూరమైన జపాన్, ఇండోనేసియా, చైనీస్‌తైపీ వర్గీకరణ మ్యాచ్‌ల్లో ఆడతాయి.
