ఇవాళ ( సెప్టెంబర్ 10 ) ఆసియా కప్ సెమీస్ మ్యాచ్... ఇండియా, బంగ్లాదేశ్ బలాబలాలివే..!

ఇవాళ ( సెప్టెంబర్ 10 ) ఆసియా కప్ సెమీస్ మ్యాచ్... ఇండియా, బంగ్లాదేశ్ బలాబలాలివే..!
  • ఫేవరెట్‌‌గా టీమిండియా
  • రా. 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

దుబాయ్‌‌: ఏడుసార్లు చాంపియన్‌‌ ఇండియా విమెన్స్‌‌ జట్టు.. ఆసియా కప్‌‌లో సెమీస్‌‌ పోరుకు రెడీ అయ్యింది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌తో తలపడనుంది. అయితే ఇరుదేశాల మధ్య అంతర్లీనంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ మ్యాచ్‌‌ కీలకంగా మారింది. ఆట పరంగా, రికార్డుల పరంగా టీమిండియా ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. గ్రూప్‌‌–ఎలో ఆడిన అన్ని మ్యాచ్‌‌ల్లో గెలిచిన టీమిండియా టాప్‌‌ ప్లేస్‌‌తో సెమీస్‌‌ బెర్త్‌‌ను కైవసం చేసుకుంది. 

ప్లేయర్లందరూ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌ను 55 రన్స్‌‌కే ఆలౌట్‌‌ చేసిన ఇండియా బౌలర్లు మంచి టచ్‌‌లో ఉన్నారు. బ్యాటింగ్‌‌లోనూ టీమిండియాకు తిరుగులేదు. రికార్డులను కొల్లగొడుతున్న స్మృతి మంధాన ఈ మ్యాచ్‌‌లో బంగ్లాకు పెను సవాల్‌‌గా మారనుంది. విధ్వంసకర ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ కూడా పవర్‌‌ప్లేలో మెరుపు ఆరంభాన్నిస్తోంది. 

కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌, రిచా ఘోష్‌‌తో కూడిన మిడిలార్డర్‌‌ ఇన్నింగ్స్‌‌లో స్థిరత్వంతో పాటు చివర్లో మెరుపు దాడులను చేస్తోంది. లోయర్‌‌ బ్యాటర్లు కూడా మెరిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌‌లో స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్‌‌, శ్రీచరణి వైవిధ్యమైన బౌలింగ్‌‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. పేసర్‌‌ రేణుకా సింగ్‌‌ ఆరంభంలోనే వికెట్లు తీయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.

బౌలర్లపైనే భారం..

ఇండియాకు పూర్తి విరుద్ధంగా బంగ్లాదేశ్‌‌ పడుతూలేస్తూ సెమీస్‌‌కు చేరింది. యూఏఈపై 34 రన్స్‌‌తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌‌లో షర్మిన్‌‌ అక్తర్‌‌, కెప్టెన్‌‌ నిగర్‌‌ సుల్తానా పోరాటం చూపెట్టారు. మిగతా బ్యాటర్లు ఫామ్‌‌లో లేకపోవడం మైనస్‌‌గా మారింది. అయితే ఈ మ్యాచ్‌‌లో ఇండియా స్టార్లను నిలువరించాలంటే బంగ్లా బౌలర్లు శక్తికి మించి శ్రమించాలి. 

రబేయా ఖాన్‌‌, నహిదా అక్తర్‌‌, మరుఫా అక్తర్‌‌లాంటి బౌలర్లు చాలా క్రమశిక్షణతో బౌలింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. అయితే షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కాబట్టి బంగ్లాను తేలికగా తీసుకుంటే ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2018 బంగ్లాదేశ్‌‌ ఆసియా టైటిల్‌‌ను గెలిచిన విషయాన్ని మర్చిపోవద్దు. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (కెప్టెన్‌‌), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, ప్రతీకా రావల్‌‌, రిచా ఘోష్‌‌, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, ప్రేమ రావత్‌‌, క్రాంతి గౌడ్‌‌, శ్రీచరణి, నందని శర్మ. 

బంగ్లాదేశ్‌‌: నిగర్‌‌ సుల్తానా (కెప్టెన్‌‌), జుయేరియా ఫెర్దోస్‌‌, శోభనా మోస్ట్రే, దిలారా అక్తర్‌‌, షోర్నా అక్తర్‌‌, రబేయా ఖాన్‌‌, షర్మిన్‌‌ అక్తర్‌‌, నహిదా అక్తర్‌‌, సుల్తానా ఖాతున్‌‌, మరుఫా అక్తర్‌‌, ఫహిమా అక్తర్‌‌.