- గంట సేపు ప్లకార్డులతో స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు
- మూడో రోజు సభ నుంచి వాకౌట్
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏపై అసెంబ్లీలో చర్చించడానికి అనుమతిస్తూ ఎజెండా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో ఒక్క ప్రజా సమస్యపై సభలో చర్చ జరగలేదని, రాత్రికి రాత్రే ఎజెండా మారుతుందని ఆయన ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
ఆ సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతపట్టుకొని స్పీకర్ పోడియం ముందుకు వచ్చి నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి స్పీకర్ తమకు అనుమతించాలంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ మంత్రులు మాట్లాడకుండా గంట సేపటిదాకా నిరోధించే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ వాళ్లకు మద్దతుగానే మీరు స్పీకర్ పోడియం ముందు గొడవ చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ లీడర్లు స్పీకర్‌ను అవమానించడం వంటి అంశాలపై చర్చ జరుగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గంట సేపటి తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు తమ సీట్లకు వెళ్లడంతో స్పీకర్ మహేశ్వర్ రెడ్డికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెషన్‌లో 26 సమస్యలపై చర్చించాలని బీఏసీలో కోరినప్పటికీ, మూడు రోజులు అవుతున్నా ఒక్క దానిపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. రాత్రికి రాత్రి ఎజెండా మారుతుందని.. ఇప్పటికైనా స్పష్టమైన ఎజెండా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని చెబుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి బయటికి వెళ్లిపోయారు.
