- వాష్ రూమ్స్, వైఫై, ఫస్ట్ ఎయిడ్.. తదితర వసతులు
హైదరాబాద్, వెలుగు: రాత్రనకా పగలనకా బైకులపై తిరుగుతూ పనిచేసే గిగ్‌వర్కర్ల కోసం విశ్రాంతి గదులు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం, క్విక్ కామర్స్ సంస్థ జెప్టో చేతులు కలిపాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ మల్కాజిగిరిలో ప్రాజెక్ట్ ప్రగతి పేరుతో ఐదు కేంద్రాలను నిర్మిస్తారు. నగరంలోని గిగ్ వర్కర్లలో 69 శాతం మందికి కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదని, 80 శాతం డెలివరీ బాయ్స్‌కు ఎండ నుంచి సేదతీరేందుకు నీడ సైతం దొరకడం లేదని ఒక సర్వేలో తేలింది.
ఈ కేంద్రాల్లో ఏసీ విశ్రాంతి గదులు, తాగునీరు, టాయిలెట్స్, మొబైల్ చార్జర్లు, వైఫై, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు ఉంటాయని జ. తరచూ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ‘ఈ–-శ్రమ్’ పోర్టల్ రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ భారాన్ని జెప్టోయే భరించనుంది. ఫుడ్ డెలివరీ, ఈ–-కామర్స్, క్విక్ కామర్స్, కొరియర్ కంపెనీల్లో పనిచేసే ప్లాట్‌ఫామ్స్, గిగ్ వర్కర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు అత్యంత కీలకమని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 2020– -21 నాటి 77 లక్షల నుంచి 2029–30 నాటికి 2.35 కోట్లకు పెరగనుందని, శ్రామిక శక్తి పెరుగుతున్న కొద్దీ వారికి కనీస మానవతా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జెప్టో సీఓవో వికాస్ ఈ సందర్భంగా వివరించారు.
