- కేసీఆర్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నరు
- సర్కారు నుంచి సమగ్ర నివేదిక కోరాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, నిరంకుశ హిట్లర్ పాలన సాగుతోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను చంపేస్తామని అధికార పక్ష ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించింది. బుధవారం కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను లోక్‌భవన్‌లో కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు తీరుపై జోక్యం చేసుకోవాలని, ఆర్టికల్ 167 కింద ముఖ్యమంత్రిని నివేదిక కోరాలని గవర్నర్కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎర్రవల్లి వైపు ర్యాలీగా వెళ్తూ.. ‘‘కేసీఆర్ చావాలి.. ఆయనకు చావు డప్పు కొడుతున్నాం’’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. మరో ఎమ్మెల్యే వేముల వీరేశం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని బహిరంగంగా బెదిరించారని పేర్కొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు స్థానిక పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ ఇచ్చి ప్రోత్సహించడం దారుణమని, దీనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మండిపడింది.
మహిళా ఎమ్మెల్యేలపై దాడులు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడిందని లేఖలో బీఆర్ఎస్ ఆరోపించింది. పోలీసులు, సివిల్ డ్రెస్సుల్లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తెలిపింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని గాయపరిచారని పేర్కొంది. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుపై భౌతిక దాడికి దిగారని వివరించింది.
ఈ ఘటనలపై అదే రోజు హైకోర్టు స్పందిస్తూ ఎమ్మెల్యేలను సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని తెలిపినట్టు గుర్తుచేసింది బీఆర్ఎస్ సభ్యులపైనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించింది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమంగా అరెస్టు చేశారని.. కానీ, కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిందని వెల్లడించింది. కానీ, శాసనమండలిలో మెజారిటీని అడ్డం పెట్టుకుని వారిద్దరినీ సభ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించింది.
నివేదిక తెప్పించండి
తమ ఫిర్యాదుపై వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని గవర్నర్‌ను బీఆర్ఎస్ కోరింది. ఈ మొత్తం వ్యవహారాలపై ముఖ్యమంత్రి నుంచి తక్షణమే నివేదిక తెప్పించాలని విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన దాడి, సివిల్ డ్రస్సులో ఉన్న వ్యక్తుల నియామకంపై సీఎస్, డీజీపీల నుంచి వివరణ తీసుకోవాలని కోరింది. సెప్టెంబర్ 7న అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను భద్రపరిచి సీజ్ చేయాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై దాడి చేసిన పోలీసులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలని కోరింది. మాజీ సీఎం కేసీఆర్‌కు, ఆయన ఎర్రవల్లి నివాసం వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. తాతా మధు, నవీన్ రెడ్డిల సస్పెన్షన్‌ను పునఃసమీక్షించేలా సభాధిపతులకు ఆదేశాలివ్వాలని కోరింది.
