ప్రజారోగ్యానికి ప్రభుత్వ ఖర్చు ఎంత? ..ఆర్థిక భద్రతతో ముడిపడిన సామాజిక సమస్య

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ఖర్చు ఎంత? ..ఆర్థిక భద్రతతో ముడిపడిన సామాజిక సమస్య

మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ పూర్తిగా తెలియదు. ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటు, క్యాన్సర్‌‌, కిడ్నీ వ్యాధి, స్ట్రోక్‌‌, ప్రమాదం లేదా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే మాత్రం ఆరోగ్యం వ్యక్తిగత విషయం కాదని, అది కుటుంబ ఆర్థిక భద్రతతో ముడిపడిన సామాజిక సమస్య అని తెలుస్తుంది.  

వ్యాధి శరీరాన్ని మాత్రమే కాదు, కుటుంబ పొదుపులను, పిల్లల చదువును, భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే,  ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది, అనారోగ్యానికి ఒక కుటుంబం ఎంత భరిస్తోంది?  అనే ప్రశ్న భారత ఆరోగ్య వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైనది. 

భారతదేశంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం గత దశాబ్దంలో పెరిగింది. 2026లో  విడుదలైన తాజా జాతీయ ఆరోగ్య ఖాతాల ప్రకారం 2013–14లో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం మొత్తం ఆరోగ్య వ్యయంలో 28.6 శాతంగా ఉండగా,  2022–23 నాటికి అది 43.7 శాతానికి పెరిగింది. 

ప్రతి ఒక్కరూ ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగలిగే ఆర్థిక స్థోమత కలిగి ఉండరు. ఆరోగ్య బీమా ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని ఖర్చులు పూర్తిగా కవర్ అవుతాయని కూడా చెప్పలేం. అందువల్ల సామాన్యుడికి అసలైన భరోసా బలమైన  ప్రభుత్వ  ఆరోగ్య వ్యవస్థ.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వైద్యులు,  నర్సులు,  మందులు,  పరీక్షలు,  అత్యవసర సేవలు  అందుబాటులో ఉంటే చాలా వ్యాధులను  ప్రారంభదశలోనే  గుర్తించవచ్చు. ఖరీదైన  చికిత్స అవసరం తగ్గుతుంది. వ్యాధి తీవ్రమయ్యే అవకాశం తగ్గుతుంది.  

కుటుంబ ఆర్థికభారం కూడా తగ్గుతుంది.  అందుకే  ఆరోగ్య  బడ్జెట్‌‌ను  కేవలం కొత్త భవనాలు, కొత్త పథకాలు,  కొత్త  ప్రకటనలతో  కొలవకూడదు. ఒక పేద  కుటుంబం  అనారోగ్యానికి గురైనప్పుడు  ప్రభుత్వ ఆసుపత్రి ఎంతవరకు అండగా నిలిచింది అనేదే అసలు కొలమానం.

ఆరోగ్య బీమా ఉంది కానీ..

ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు  వైద్యఖర్చుల భారాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు ఆయుష్మాన్‌‌ భారత్‌‌– ప్రధాన్‌‌మంత్రి జన ఆరోగ్య యోజన అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆసుపత్రి  చికిత్సకు  కవరేజీ  అందిస్తోంది. 

ఈ పథకం లక్ష్యం తీవ్రమైన వైద్యఖర్చుల వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుదేలవకుండా చూడటం. అయితే  బీమా మాత్రమే ఆరోగ్య వ్యవస్థకు పూర్తి పరిష్కారం కాదు. ఆసుపత్రిలో చేరకముందు చేసే  పరీక్షలు,  మందులు,  అనేక  దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, ఆసుపత్రి వెలుపల కొనాల్సిన మందులు వంటి ఖర్చులు కుటుంబాలపై  కొనసాగుతూనే ఉంటాయి. అందుకే చికిత్సకు బీమాతోపాటు, వ్యాధి రాకుండా చేసే  ప్రజారోగ్య వ్యవస్థ కూడా బలపడాలి.

ఆరోగ్యాన్ని ఖర్చుగా కాదు..  పెట్టుబడిగా చూడాలి

భారతదేశంలో  ఆరోగ్యంపై  ప్రభుత్వ వ్యయం పెరుగుతున్నప్పటికీ,  ప్రజారోగ్యంపై పెట్టుబడులు ఇంకా మరింత బలపడాల్సిన అవసరం ఉంది.  2026–27  కేంద్ర  బడ్జెట్‌‌లో  ఆరోగ్య మంత్రిత్వ శాఖకు  రూ.1,06,530 కోట్లకు పైగా  కేటాయింపులు చేశారు.  

అయితే ప్రజారోగ్య బాధ్యతలో రాష్ట్రాల పాత్ర కూడా కీలకం. ఆరోగ్యంపై పెట్టే  ప్రతి రూపాయి భవిష్యత్తులో పెద్ద ఖర్చును తగ్గించే పెట్టుబడిగా చూడాలి.  చివరికి ఒక దేశం అభివృద్ధిని కేవలం రహదారులు,  భవనాలు, పరిశ్రమలు, జీడీపీతో  కొలవడం సరిపోదు.

పరిష్కార మార్గాలు

ప్రభుత్వం ఆరోగ్యంపై  రూ.100 ఖర్చు చేస్తే,  ఒక కుటుంబం అనారోగ్యానికి తన జేబు నుంచి మరో  రూ.82 వరకు  ఖర్చుచేసే  పరిస్థితి  ఉండకూడదు.  ఆరోగ్యవంతమైన  దేశం  అంటే  ఆసుపత్రులు,  మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉండటం కాదు.  అనారోగ్యం వచ్చినప్పుడు  ఒక  కుటుంబం తన జీవితకాల  పొదుపులను  కోల్పోకుండా చికిత్స పొందగలగడం.   

అందుకు కొన్ని పరిష్కార మార్గాలు...

 మొదటిది:  ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని మరింత పెంచాలి.  ముఖ్యంగా  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,  జిల్లా ఆసుపత్రులు, అత్యవసర వైద్యం, మందులు, నిర్ధారణ పరీక్షలు, మానసిక ఆరోగ్య సేవలకు నిధులు పెరగాలి.

రెండోది:  వ్యాధి వచ్చిన తర్వాత ఖర్చు చేయడం కంటే  వ్యాధి రాకుండా చేయడంపై  పెట్టుబడి పెట్టాలి.  రక్తపోటు,  మధుమేహం,  గుండెజబ్బులు,  క్యాన్సర్,  పొగాకు  వినియోగం,  మద్యపానం, ఊబకాయం, మానసిక ఆరోగ్యం వంటి  అంశాల్లో  ముందస్తు  స్క్రీనింగ్‌‌, నివారణ కార్యక్రమాలు బలపడాలి. 

మూడోది:  ఆరోగ్య బీమా  కవరేజీని విస్తరించాలి.  ఆయుష్మాన్‌‌ భారత్‌‌– పీఎంజేఏవై  ప్రస్తుతం  అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆసుపత్రి చికిత్స కవరేజీని అందిస్తోంది.  ఇటువంటి పథకాలు నిజంగా అవసరమైన  కుటుంబాలకు చేరేలా,  చికిత్స సమయంలో కుటుంబం అదనపు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు తగ్గేలా పర్యవేక్షణ అవసరం. 

నాలుగోది:  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు,  పరీక్షలు  ఉచితంగా  లేదా అత్యల్ప ఖర్చుతో  అందుబాటులో ఉండాలి.  ఎందుకంటే  కుటుంబాలపై  పడే  ప్రత్యక్ష ఆరోగ్య వ్యయంలో మందులు,  పరీక్షలు,  దీర్ఘకాలిక చికిత్స ప్రధాన భాగాలు.  ప్రజలపై భారం పడకుండా అనారోగ్య  ఖర్చులను  ప్రభుత్వమే భరించాలి.

ఐదవది:   ఆరోగ్యాన్ని  బడ్జెట్‌‌లో  ఖర్చుగా కాకుండా  దేశ భవిష్యత్తుపై పెట్టుబడిగా  చూడాలి.  ఒక కుటుంబం అనారోగ్యంతో తన పొదుపులు మొత్తం కోల్పోతే దాని ప్రభావం కుటుంబంతోనే  ఆగదు.  పిల్లల విద్య,  కుటుంబ ఆదాయం,  అప్పులు,  జీవన ప్రమాణం అన్నింటిపైన  పడుతుంది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ  బలపడినరోజే  సామాన్యుడి కుటుంబ  ఆర్థికభద్రత  కూడా బలపడుతుంది.

- డాక్టర్. కేశవులు భాషవత్తిని. ఎండీ.,సీనియర్ మెంటల్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్ 

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.