తెలంగాణ భాషకు కాళోజీ సేవలు చిరస్మరణీయం

తెలంగాణ భాషకు కాళోజీ సేవలు చిరస్మరణీయం

ముషీరాబాద్/కోఠి/గండిపేట/హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన సాహిత్యం ద్వారా ప్రతిబింబించిన మహోన్నత కవి కాళోజీ నారాయణరావు అని నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కసప నరేందర్​కొనియాడారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాళోజీ రచనల్లో సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య భావజాలం, మానవీయ విలువలు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని బుధవారం బాగ్​లింగంపల్లిలోని అంబేద్కర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శేఖర్ మట్టా, డా.ముదిగొండ భవాని, డా.అశోక్ గుండే, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ భాష మన ఆత్మగౌరవానికి ప్రతీక

తెలంగాణ భాష మన ఆత్మగౌరవానికి ప్రతీక అని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.సూర్యా ధనంజయ్‌‌‌‌ అన్నారు. కోఠిలోని వర్సిటీ పీజీ సెమినార్‌‌‌‌ హాల్‌‌‌‌లో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వివక్ష, నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ భాషను తన శ్వాసగా జీవించిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమ అధ్యక్షుడు డా.సంగనభట్ల నరసయ్య, రిజిస్ట్రార్‌‌‌‌ ప్రొ.మల్లేశం, ఓఎస్డీ విజయలక్ష్మి, బీసీ సెల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ శైలజ, మైనార్టీ సెల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ అమీనా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పోలీస్‌‌‌‌ అకాడమీలో..

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ పోలీస్‌‌‌‌ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఫొటోకు అకాడమీ డైరెక్టర్‌‌‌‌ అభిలాష బిస్త్‌‌‌‌, అధికారులు నివాళి అర్పించారు. కాళోజీ తెలంగాణ సమాజానికి, తెలుగు భాషకు చేసిన సేవలు మరువలేనివన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కాళోజీ కీలక పాత్ర పోషించారని, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తన సాహిత్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారని గుర్తు చేశారు. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు మురళీధర్, వెంకటేశ్వర్లు, కె.ఆర్‌‌‌‌.కె.ప్రసాద్ తదితరులున్నారు.   

ప్రజల హక్కుల కోసం పోరాడారు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఫొటోకు జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నివాళి అర్పించారు. కాళోజీ ప్రజల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఆయన తెలుగుతోపాటు మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లో రచనలు చేశారని పేర్కొన్నారు.