అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగ జేఏసీతో సీఎం భేటీ

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యోగ జేఏసీతో సీఎం భేటీ

 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగ జేఏసీ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయి, దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి హామీ ఇచ్చినట్లు టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌‌ రెడ్డి వెల్లడించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో ఎమ్మెల్సీలు కోదండరామ్‌‌, అద్దంకి దయాకర్‌‌, పీఆర్టీయూటీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌‌తో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గంటపాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

ఈ ఏడాది నుంచి పిల్లలకు క్వాలిటీ టిఫిన్ అందిస్తున్నామని తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు పోలీసు రిక్రూట్‌‌మెంట్‌‌లో వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇచ్చారని, జనరల్‌‌ అభ్యర్థులకు 32 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 37 ఏళ్ల వరకు వయోపరిమితిని పొడిగిస్తామని తెలిపారని పేర్కొన్నారు.

ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ స్కీము మరింత పటిష్టంగా అమలు చేయనున్నామని, విద్యార్థి బ్యాంక్‌‌ ఖాతాలోకే ఫీజు డబ్బులు జమ అయ్యేలా చూస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆడిట్‌‌ కమిటీ చైర్మన్‌‌ సోమిరెడ్డి శ్రీనివాస్‌‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.