నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో గట్టిగనే కురవనున్న వాన

నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో గట్టిగనే కురవనున్న వాన
  • నేడు మోస్తరు.. రేపటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వర్షాల విరామానికి తెరపడనుంది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే అవకాశాలున్నాయి. గురువారం మోస్తరు వర్షాలు.. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

గురువారం హైదరాబాద్​ సిటీ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.

శుక్రవారం నుంచి ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

సాధారణం కన్నా ఎక్కువగా టెంపరేచర్లు
గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణొగ్రతలు 38 డిగ్రీల దాకా రికార్డవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఖమ్మంలో 37.6 డిగ్రీలు, నల్గొండలో 37.6, వరంగల్‌‌లో 37.5, ములుగులో 37.3, భద్రాద్రి కొత్తగూడెంలో 37.1, నారాయణపేటలో 37.1, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌లో 37, మహబూబాబాద్‌‌లో 36.9, హనుమకొండలో 36.8, నిర్మల్‌‌లో 36.6, పెద్దపల్లిలో 36.3, ఆదిలాబాద్‌‌లో 35.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత తీవ్రంగా ఉంది.

రాష్ట్రమంతటా గాలిలో తేమ వంద శాతంగా రికార్డయింది. దీంతో జనం అల్లాడిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ ఏసీలు, కూలర్లు వాడుకునే పరిస్థితులున్నాయి. దీంతో ఇటు కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి.