హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ పై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్(సీపీఎస్‌ఈయూ) స్వాగతించింది.
కానీ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన రోజు నవంబర్ 17 నాటికి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుపై తుది ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్ గౌడ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
కాలయాపన లేకుండా నిర్దిష్ట కాలపరిమితి నవంబర్ 17 లోపు గడువుతో కూడిన జీవోను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఆ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సీపీఎస్ రద్దుపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణలోనూ అదే చిత్తశుద్ధిని చాటుకోవాలని స్థితప్రజ్ఞ కోరారు. సీసీపీఎస్ఈయూకు ప్రభుత్వ ఏర్పాటు చేసే కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
