ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
  • అధ్యక్షుడిగా బి. వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఎం. నర్సింహ
  • కరీంనగర్‌‌లో జరిగిన నాలుగో రాష్ట్ర మహాసభల్లో ఎన్నిక

హైదరాబాద్‌‌‌‌‌‌, వెలుగు: ఏఐటీయూసీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బి. వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఎం. నర్సింహ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌‌లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభల్లో ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు సంఘం రాష్ట్ర సలహాదారు ఎండీ యూసుఫ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌‌ హిమాయత్‌‌నగర్‌‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నూతన కార్యవర్గ వివరాలను అధికారికంగా ప్రకటించారు.

సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎండీ యూసుఫ్, అధ్యక్షుడిగా బి. వెంకటేశం, వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం. నర్సింహ్మ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా పల్లా దేవేందర్ రెడ్డి, కోశాధికారిగా కమతం యాదగిరి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్. విలాస్, పి. ప్రేంపావని, ఎం.ఎస్‌‌. మూర్తి, ఇ. వెంకన్న, టి. రామాంజనేయులు, వి. జైపాల్ రెడ్డి, ఎం. ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు.

అలాగే కార్యదర్శులుగా టి. సమ్మయ్య, ఎన్. ప్రసాద్, వై. ఓమయ్య, ఎం. శ్రీనివాస్, ఎండీ ఇమ్రాన్, పి. పర్వతాలు, కె. రాజ్‌‌కుమార్, ఎం. దాస్, హసీనా బేగం, ఆర్‌‌. శివరామకృష్ణ ఎన్నికయ్యారు. వీరితో పాటు మొత్తం 121 మందితో కౌన్సిల్‌‌ను, 47 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు యూసుఫ్ తెలిపారు.

4 లేబర్ కోడ్‌‌లను వెంటనే రద్దు చేయాలి
నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. వెంకటేశం, ఎం. నర్సింహ్మ మాట్లాడుతూ.. మహాసభల్లో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఆమోదించిన 54 తీర్మానాలను విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలను సవరిస్తూ కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెడుతోందని మండిపడ్డారు.

కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌‌లను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస పెన్షన్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని పిలుపునిచ్చారు.