ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల ఉద్యోగులు, అధికారులు ఉమ్మడిగా ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సెప్టెంబర్ 11, శుక్రవారం రోజున జరగనున్న ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. కేవలం ఒక్క రోజు సమ్మె మాత్రమే కాకుండా.. ఆ వెంటనే వరుస సెలవులు రావడం కస్టమర్లకు పెద్ద తలనొప్పిగా మారనుంది. శుక్రవారం సమ్మె, రెండవ శనివారం సెలవు, ఆదివారం వీకెండ్ హాలిడే, ఆ తర్వాత సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం రావడంతో మొత్తంగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ఈ వరుస సెలవుల ప్రభావం అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై తీవ్రంగా పడనుంది. చెక్కుల క్లియరింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో పాటు, బ్యాంకు శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు పూర్తిగా ఆగిపోతాయి. ముఖ్యంగా 4 రోజుల పాటు నగదు డిపాజిట్లు నిలిచిపోవడం వల్ల ఏటీఎంలలో కరెన్సీ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఏవైనా అర్జెంట్ పనులుంటే ఇవాళే కంప్లీట్ చేసుకోవటం మంచిది.
పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడమే ఈ సమ్మెకు ప్రధాన కారణమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రతీ నెలా అన్ని శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించాలని 3 ఏళ్ల క్రితం నాటి డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. అంతేకాకుండా ఇతర పెండింగ్ డిమాండ్లపై యాజమాన్యం, ప్రభుత్వం చర్చలు జరిపి ఎలాంటి పరిష్కారం చూపకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు సమ్మే నిర్ణయం తీసుకున్నారు. అయితే బ్యాంకులు పనిచేయనప్పటికీ డిజిటల్ చెల్లింపులు, యూపీఐ పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఉండబోదు. అయితే నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులను మాత్రం వెంటనే కంప్లీట్ చేసుకోవటం బెటర్.
