- సోషల్ మీడియాలో పెడతామంటూ తల్లికి బెదిరింపులు
మేడిపల్లి, వెలుగు: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. లోన్ బకాయి చెల్లించలేదంటూ బోడుప్పల్‌కు చెందిన ఓ మహిళను నిర్వాహకులు బెదిరించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా పదో తరగతి చదువుతున్న ఆమె కూతురికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి మహిళకు పంపినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, ఇతరులకు పంపిస్తామని బెదిరించినట్లు మహిళ తెలిపింది. తనకు, తన కుటుంబానికి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు వస్తున్నాయని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళకు వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, మార్ఫింగ్ ఫొటోలు తదితర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. లోన్ యాప్ నిర్వాహకుల వివరాలు, ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
