- కేసీఆర్ డైరెక్షన్ లోనే గొడవలు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ట్రైనింగ్ తీసుకుని అసెంబ్లీలో యాక్టింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్‌లోనే సభలో గొడవలు జరుగుతున్నాయన్నారు. బుధవారం లంచ్ బ్రేక్ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ కుల అహంకారం బయటపడిందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సభలో గొడవలు సృష్టించారని ఆరోపించారు.
స్వరాష్ట్రంలోనూ దళితులు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ‘ఫెవికాల్ బంధం’ బయటపడిందన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించి స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. కేసీఆర్ చర్యలు హిట్లర్‌ను మరిపించేలా ఉన్నాయని విమర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు జరిగిన అవమానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వైఖరి ‘దొంగే దొంగ అన్నట్లుగా’ ఉందని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వీరి నుంచి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ రూల్‌బుక్‌ను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ.. ఎక్కువగా తిట్టినవారే గొప్ప నేతలవుతారన్నట్లుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. సభలో క్రమశిక్షణ ఉల్లంఘించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకునేలా రూల్‌బుక్‌లో మార్పులు చేయాలని కోరారు.
