కానిస్టేబుల్ వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు

కానిస్టేబుల్ వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూనిఫామ్ పోస్టుల కోసం సిద్ధమవుతున్న వేలాది నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖల్లోని కానిస్టేబుల్ తదితర సమానమైన పోస్టుల (డ్రైవర్ పోస్టులు మినహా) ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) శాఖ సీఎస్​సంజయ్ జాజూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీవో 122 ద్వారా యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయోపరిమితిని 7 ఏళ్లు పెంచగా, హోం శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల మధ్య ఉన్న 3 ఏళ్ల తేడాను గమనించిన ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రయోజనార్థం పరిశీలించి కానిస్టేబుల్ పోస్టులకు ఈ అదనపు సడలింపును ప్రకటించింది.

పెరిగిన సడలింపులతో వేలాది మందికి లబ్ధి

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 3 ఏళ్ల అదనపు వయోసడలింపుతో కలిపి, జీవో 87, జీవో 122 ద్వారా ఇదివరకే ఇచ్చిన 7 ఏళ్ల సడలింపుతో మొత్తం10 ఏళ్ల సడలింపు కానిస్టేబుల్ అభ్యర్థులకు లభించనుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్  ద్వారా చేపట్టే రాబోయే నియామకాలకు ఈ నూతన వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం కఠిన సాధన చేస్తూ వయోపరిమితి ముగిసిపోతుందనే ఆందోళనలో ఉన్న వేలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయంతో  ఊరట లభించినట్లయింది.