పెండింగ్‌‌ నిధులు విడుదల చేయాలి: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం

పెండింగ్‌‌ నిధులు విడుదల చేయాలి: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం
  • ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

బషీర్‌‌బాగ్, వెలుగు: గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్‌‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌ చేస్తూ మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌‌ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు అసెంబ్లీ మెట్రో స్టేషన్‌‌ నుంచి ర్యాలీగా అసెంబ్లీ వైపు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్  చేశారు.

ఈ క్రమంలో మాజీ సర్పంచులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామపంచాయతీలకు రావాల్సిన స్టేట్‌‌ ఫైనాన్స్‌‌ కమిషన్‌‌(ఎస్‌‌ఎఫ్‌‌సీ) నిధులతో పాటు ఇతర పెండింగ్‌‌ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సుర్వి యాదయ్య గౌడ్‌‌ డిమాండ్‌‌ చేశారు.

గ్రామాల్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌‌ బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ఇప్పటికే పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు పెండింగ్‌‌లో ఉండటంతో ప్రస్తుత, మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధుల విడుదలపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలోని ప్రస్తుత, మాజీ సర్పంచులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సుర్వి యాదయ్య గౌడ్‌‌ హెచ్చరించారు.