పంజాగుట్ట, వెలుగు: స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని చట్టపరంగా శిక్షించడంతో పాటు శాసన మండలి నుంచి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని ఆలిండియా దళిత సేన జాతీయ చైర్మెన్ జేబీ రాజు డిమాండ్ చేశారు.
బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళితులు ఏ స్థాయిలో ఉన్నా జీర్ణించుకోలేక అగ్రవర్ణాల వారు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరైంది కాదన్నారు.
స్పీకర్ను దూషించడమంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిందితులపై పార్టీ పరంగా చర్యలు తీసుకొని దళిత సమాజం దృష్టిలో నిర్దోషిగా నిరూపించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరంకుశ దొరల పాలన సాగదని, ఇక నుంచి దళిత నాయకులను దూషిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
వెన్నెల గద్దర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కులతత్వాన్ని పోషిస్తూ, ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం వల్లే సమాజంలో తారతామ్యాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా శాసన సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయానంద్, జాగిరాల సుజ్జీ, సీఎల్ యాదన్న, సీఎల్ యాదగిరి, ఐలయ్య, ఇక్బాల్, జంగన్న ముదిరాజ్, సత్యనారాయణ, రిటైర్డ్ ఇజనీర్ చిత్రారామన్ పాల్గొన్నారు.
