- శాసనమండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, వెలుగు: సబ్సిడీ ఎరువులను నిజమైన రైతులకు పారదర్శకంగా, అవసరమైన మేరకు అందించేందుకే యాప్ విధానాన్ని తీసుకొచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత యాసంగి నుంచి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో, కేంద్రం దేశవ్యాప్తంగా డిజిటల్ విధానాన్ని తెచ్చిందని తెలిపారు.
కేంద్రం రూపొందించిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్‌ను సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. కొత్త యాప్‌తో అక్కడక్కడా సాంకేతిక సమస్యలు వస్తున్నా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. సర్వర్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు మీ-సేవ, కామన్ సర్వీస్ సెంటర్లు, వ్యవసాయ అధికారులు, డీలర్లు, వలంటీర్ల సాయంతో బుక్ చేసుకోవచ్చన్నారు.
సరిపడా యూరియా..
రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. నిల్వలను 16–17 లక్షల టన్నుల నుంచి 22-–23 లక్షల టన్నులకు పెంచామన్నారు.
