బ్రిక్స్‌‌‌‌ సమిట్‌‌‌‌కు ఢిల్లీ రెడీ..సెప్టెంబర్12,13 తేదీల్లో సదస్సు.. 30 వేల మందితో భద్రత కట్టుదిట్టం

బ్రిక్స్‌‌‌‌ సమిట్‌‌‌‌కు ఢిల్లీ రెడీ..సెప్టెంబర్12,13 తేదీల్లో  సదస్సు.. 30 వేల మందితో భద్రత కట్టుదిట్టం
  • సెప్టెంబర్​ 12న పుతిన్‌‌‌‌ రాక.. 13న జిన్‌‌‌‌పింగ్‌‌‌‌
  • అగ్రనేతలకు ప్రత్యేక హోటళ్లు.. టేస్టీ వంటకాలు
  • నోయిడాకు చేరిన మూడు రష్యా ఫ్లైట్లు
  • రష్యాతో 105 విమానాల మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌పై చర్చలు

న్యూఢిల్లీ: బ్రిక్స్‌‌‌‌ సమిట్‌‌‌‌కు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఈ నెల12, 13వ తేదీల్లో భారత్‌‌‌‌ మండపం వేదికగా సదస్సు జరగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌‌‌‌ పుతిన్‌‌‌‌ శుక్రవారం, చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ శనివారం ఢిల్లీకి రానున్నారు.

 ఇరాన్‌‌‌‌ అధ్యక్షుడు మసూద్‌‌‌‌ పెజెష్కియాన్‌‌‌‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితర దేశాల అగ్రనేతలు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌‌‌‌పింగ్ ఏడు సంవత్సరాల తర్వాత భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత నుంచి ఆతిథ్యం వరకు భారత్‌‌‌‌ అన్ని ఏర్పాట్లను చేసింది. 

బ్రిక్స్‌‌‌‌ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సుమారు 30 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. విమానాశ్రయాలు, హోటళ్లు, భారత్‌‌‌‌ మండపం చుట్టూ ప్రత్యేక భద్రతా వలయాలు ఏర్పాటు చేశారు.

 భద్రతా వ్యవస్థను పలు విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి డీసీపీ లేదా అదనపు డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. చైనా, రష్యాలకు చెందిన భద్రతా బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. వారు స్పెషల్​సెక్యూరిటీ ఎక్విప్‌‌‌‌మెంట్, ఆయుధాలతో తమ దేశాధినేతల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

హోటల్‌‌‌‌ సిబ్బంది వివరాలను ఢిల్లీలోనే కాకుండా వారి స్వస్థలాల్లోనూ పోలీసులు తనిఖీ చేశారు. పుతిన్‌‌‌‌, జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ తమ వాహనాలు, కాన్వాయ్‌‌‌‌ కార్లలో కొన్నింటిని విమానాల్లోనే తీసుకురానున్నారు. రష్యా, చైనా ప్రతినిధుల కాన్వాయ్‌‌‌‌లు భారీగా ఉండే అవకాశం ఉంది. పుతిన్‌‌‌‌ రాకకు ముందు మూడు రష్యా రవాణా విమానాలు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి.

అగ్రనేతలకు స్పెషల్​ ఆతిథ్యం

బ్రిక్స్‌‌‌‌ సమావేశానికి వచ్చే ప్రముఖులకు ఢిల్లీలోని వివిధ హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. పుతిన్‌‌‌‌ బస చేసే హోటల్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌ వీఐపీలకు కూడా వసతి కల్పించారు. ఇరాన్‌‌‌‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌‌‌‌కు ప్రత్యేక హోటల్‌‌‌‌ కేటాయించారు. 

చైనా, బెలారస్‌‌‌‌ అధ్యక్షులు ఒకే హోటల్‌‌‌‌లో ఉంటారు. ఇండోనేషియా అధ్యక్షుడు, ఇథియోపియా ప్రధాని, కజకిస్తాన్‌‌‌‌ అధ్యక్షుడు తదితరులకు మరో హోటల్‌‌‌‌లో బస ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులు ఒకే హోటల్‌‌‌‌లో ఉంటారు. 

ఫిలిప్పీన్స్‌‌‌‌ అధ్యక్షుడు, వియత్నాం ప్రధాని, బొలీవియా ప్రతినిధులు, క్యూబా, ఉరుగ్వే ఆర్థిక మంత్రులకు కూడా ఒకే హోటల్‌‌‌‌లో వసతి కల్పించారు. ఈ అతిథుల కోసం హోటళ్లలో ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

కశ్మీర్‌‌‌‌ నుంచి తమిళనాడు వరకు వివిధ ప్రాంతాల చిరుతిళ్లను మెనూలో చేర్చారు. మిల్లెట్‌‌‌‌తో చేసిన ఆరోగ్యకరమైన వంటకాలు, బిస్కెట్లు, తేలికపాటి ఆహారాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. గులాబీ, కుంకుమపువ్వు, యాలకులతో ప్రత్యేక మిఠాయిలను తయారు చేస్తున్నారు. భారతీయ, ఆసియా రుచుల కలయికతోనూ వంటకాలు అందించనున్నారు.

నేడు పుతిన్‌‌‌‌తో మోదీ భేటీ..

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌‌‌‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే చాన్స్ ఉంది. వాణిజ్యం, ఆర్థిక సహకారం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. భారత్‌‌‌‌–రష్యా పౌర విమానయాన సహకారంపైనా చర్చలు సాగుతాయి. 

రష్యా విమానాల తయారీని భారత్‌‌‌‌లో చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఐఎల్‌‌‌‌–114, సుఖోయ్‌‌‌‌ సూపర్‌‌‌‌జెట్‌‌‌‌ 100 విమానాల తయారీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. 105 ప్రాంతీయ విమానాల సరఫరా, తయారీకి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

రెండు రోజులపాటు సమిట్.. 

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ సవాళ్ల నేపథ్యంలో, భారతదేశం ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండు రోజుల పాటు కొనసాగనుంది. గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా ఆహార భద్రత, ఫ్యూయల్​స్టెబిలిటీ, సప్లై చెయిన్ భద్రతకు ఈ సదస్సులో పెద్దపీట వేయనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా టారిఫ్ విధానాల ప్రభావంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.