కార్గో నౌకలో మంటలు.. చైనాలోని కింగ్డావో పోర్టులో ఘటన

కార్గో నౌకలో మంటలు..   చైనాలోని కింగ్డావో పోర్టులో ఘటన
  •  ఫిలిప్పీన్స్‌‌ ఫెర్రీలోనూ మంటలు.. ఐదుగురి మృతి 

బీజింగ్/మనీలా: చైనా షాన్‌‌డాంగ్ ప్రావిన్స్‌‌లోని కింగ్డావో పోర్టులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓడరేవులోని బెహై షిప్‌‌ బిల్డింగ్ కంపెనీ వద్ద రిపేర్ల కోసం ఆపి ఉంచిన ఓషన్ మెలోడీ అనే కార్గో నౌక (లైబీరియా)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో 12 మందిని సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. 

గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాదం జరగగా.. మధ్యాహ్నం 2:30 గంటలకల్లా సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నౌకలో గల్లంతైన వారిని,  మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

ఫిలిప్పీన్స్‌‌లో 80 మంది గల్లంతు.. 

ఫిలిప్పీన్స్‌‌లో ఘోర ఫెర్రీ ప్రమాదం జరిగింది. పలవాన్‌‌ ప్రావిన్స్‌‌లోని కొరోన్‌‌కు వెళ్తున్న ‘ఎంవీ జూన్ ఆస్టర్’ ఫెర్రీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 80 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు ప్రయాణికులు సముద్రంలోకి దూకేశారు.

 కోస్ట్‌‌గార్డ్‌‌ సిబ్బంది 43 మందిని రక్షించారు. బుధవారం సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా..ఆ సమయంలో ఫెర్రీలో  117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.