- వేలాది మంది అమెరికన్ల డేటా హ్యాక్ చేశారని ఆరోపణ
- మూడు కంపెనీలను ‘ఎంటిటీ లిస్ట్’లో చేర్చాలని డిమాండ్
వాషింగ్టన్: అమెరికన్లు, అక్కడి కంపెనీలకు చెందిన డేటాను హ్యాక్ చేసి చోరీ చేశారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన మూడు సైబర్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ సెనేటర్లు రాన్ వైడెన్, షెల్డన్ వైట్‌హౌస్, రిపబ్లికన్ సెనేటర్ పాట్ హారిగన్ ఈ మేరకు అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌కు లేఖ రాశారు. భారత్‌కు చెందిన సన్‌కిస్డ్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్‌ట్రాక్స్ లిమిటెడ్, సైబర్‌రూట్ లిమిటెడ్ సంస్థలు వేలాది మంది అమెరికన్లు, కంపెనీల డేటాను హ్యాక్ చేసి చోరీ చేశాయని సెనేటర్లు ఆరోపించారు.
భారత్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ‘సైబర్ మెర్సినరీ’ గ్రూపులు 15 ఏళ్లకు పైగా అమెరికా పౌరులు, వ్యాపార సంస్థలు, న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. రాయిటర్స్, సిటిజన్ ల్యాబ్ దర్యాప్తులను ప్రస్తావిస్తూ.. ప్రైవేట్ ఈక్విటీ, ఫార్మా కంపెనీలతో పాటు ప్రముఖ అమెరికా న్యాయ సంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా లాయర్లను లక్ష్యంగా చేసుకున్నారని సెనేటర్లు తెలిపారు. ఖతార్ వరల్డ్‌కప్ బిడ్‌ను వ్యతిరేకించిన వారిని కూడా ఈ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తమ హ్యాకింగ్ కార్యకలాపాలపై వచ్చిన కథనాలను అడ్డుకునేందుకు విదేశీ కోర్టులను ఆశ్రయించారని కూడా ఆరోపించారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ది న్యూయార్కర్ వంటి సంస్థలపై సంబంధిత కంపెనీలు న్యాయపోరాటాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మూడు భారత కంపెనీలను అమెరికా వాణిజ్య శాఖ ‘ఎంటిటీ లిస్ట్’లో చేర్చి, అమెరికన్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ అందకుండా చర్యలు తీసుకోవాలని సెనేటర్లు కోరారు.
