డీసీఎంకు మంటలు.. క్లీనర్, 270 మేకలు సజీవ దహనం

డీసీఎంకు మంటలు.. క్లీనర్, 270 మేకలు సజీవ దహనం
  • మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో ప్రమాదం

అడ్డాకుల/మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఓ డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తితో పాటు వందలాది మేకలు సజీవదహనం అయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో నేషనల్ హైవే 44పై గురువారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్​ప్రాంతానికి చెందిన డ్రైవర్లు రషీద్, అబ్దుల్ బారీ, ఇస్తికర్, క్లీనర్ అమిత్​కుమార్​(32) కలిసి ఓ డీసీఎంలో 300 మేకలను తీసుకొని ఈ నెల 8న కాన్పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు.

గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలోకి చేరుకోగానే అతి వేగం కారణంగా డీసీఎం అదుపుతప్పి హైవే పక్కన ఉన్న నేమ్ బోర్డును ఢీకొట్టింది. ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ దెబ్బ తినడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 

క్షణాల్లో డీసీఎం మొత్తానికి వ్యాపించడంతో అమిత్ కుమార్ తో పాటు 270 మేకలు సజీవ దహనం కాగా, రషీద్, అబ్దుల్ భారీ, ఇస్తికర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ డి.జానకి ఘటనాస్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి బంధువు దయశంకర్​ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భూత్పూర్​ పోలీసులు తెలిపారు.